- District News
- Ranga Reddy
- రూపారెడ్డి హత్యను ఖండిస్తూ ఆమనగల్లులో ట్రస్మా భారీ నిరసన ర్యాలీ
రూపారెడ్డి హత్యను ఖండిస్తూ ఆమనగల్లులో ట్రస్మా భారీ నిరసన ర్యాలీ
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి
లోకల్ గైడ్
ఆమనగల్లు, ఆగస్టు 21:
నల్లగొండ జిల్లాలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి రూపారెడ్డి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఆమనగల్లు డివిజన్ ట్రస్మా ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆమనగల్లు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల, మాడుగుల, వెల్దండ మండలాలకు చెందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది వందల సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
ట్రస్మా ఆమనగల్లు డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అబ్బిమల్ల శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ముందుగా రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహిస్తూ రూపారెడ్డి హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ట్రస్మా ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యాబుద్ధులు అందిస్తూ సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులపై దాడులు జరగడం తీవ్ర ఆందోళనకరమని అన్నారు. రూపారెడ్డి హత్య ఘటన విద్యారంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిలో భయాందోళనలు కలిగించిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి ప్రాణ, భద్రతకు ప్రభుత్వం తగిన భరోసా కల్పించాలని కోరారు. పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులపై బెదిరింపులు, భౌతిక దాడులు, వేధింపులు జరగకుండా ప్రత్యేకంగా జిల్లా స్థాయి పోలీస్ నోడల్ అధికారి వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలా ప్రభుత్వం అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యారంగంలో పనిచేసే వారి భద్రతను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలని తెలిపారు.
ర్యాలీ అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ట్రస్మా ప్రతినిధులు అధికారికి వినతిపత్రం అందజేశారు. రూపారెడ్డి హత్య ఘటనపై న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా ట్రస్మా ప్రతినిధులు అల్లాజిగౌడ్, అవ్వారి శివలింగం, అవ్వారి నిరంజన్, గోలి శ్రీనివాసులు, కోట్ల వెంకటేష్, ఆమనగంటి సంజీవ్ కుమార్, కమటం శేఖర్, యు. శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మణస్వామి, ఆంజనేయులు, జంగయ్యగౌడ్, రామస్వామిగౌడ్, తిరుమలేష్, శ్రీశైలం, రమేష్, విట్టల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
రూపారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ విద్యారంగం రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ట్రస్మా నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
