- District News
- 17 డిమాండ్ల సాధనకు రిలే నిరాహార దీక్ష
17 డిమాండ్ల సాధనకు రిలే నిరాహార దీక్ష
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి : సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్
చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో 17 డిమాండ్ల సాధన కోసం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు పాలెం సుక్కయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ దీక్షకు మద్దతుగా పార్టీ డివిజన్ నాయకులు సాయన్న, చర్ల మండలం దోసినపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ గొంది ముయ్యన్న పాల్గొని, పాలెం సుక్కయ్యకు మాస్‌లైన్ పార్టీ టవల్ కప్పి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు సాయన్న, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు కంగాల అభిరామ్ మాట్లాడుతూ చర్ల నుంచి భద్రాచలం వరకు పూర్తిగా దెబ్బతిన్న రహదారిని తొలగించి నూతన రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. సాగు చేస్తున్నప్పటికీ సర్వే పట్టాలు లేని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఇసుక లారీలను నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఇసుక లారీల ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం అందించాలని, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలని, సంబంధిత చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాల హక్కులను పరిరక్షించాలని, గిరిజన రైతులు సాగు చేస్తున్న పోడు భూముల్లోని పంటలను ధ్వంసం చేయవద్దని కోరారు. ప్రజలు, గిరిజన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మొత్తం 17 డిమాండ్లతో రిలే నిరాహార దీక్ష చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ భద్రాచలం డివిజన్ నాయకురాలు సిమిడి సుజాత, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకురాలు చింతకాయల సరళ, ఐక్య రైతు సంఘం మండల అధ్యక్షులు కల్లూరు కృష్ణ, పార్టీ మండల నాయకులు కొరసారాంశెట్టి పునీష్ రావు, తాటి మురళి, మోడీ, ఎం.సమ్మక్క, కల్లూరు సంధ్య, సుంకరి సమ్మక్క, గణేష్, పాలెం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
