- District News
- Ranga Reddy
- కుల గణనతోనే సామాజిక న్యాయం – కొప్పుల రాజు
కుల గణనతోనే సామాజిక న్యాయం – కొప్పుల రాజు
గాంధీభవన్ లో కులగణన పై విలేకరుల సమావేశం.
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
శుక్రవారం గాంధీ భవన్‌లో కుల గణన అంశంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొప్పుల రాజు మాట్లాడుతూ, ఓబీసీ ల విషయంలో మండల్ కమిషన్ కూడా చాలా వరకు 1931 నాటి జనాభా గణాంకాలపైనే ఆధారపడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. కులాల వారీగా ప్రస్తుత జనాభా, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన తాజా సమాచారం లేకుండా న్యాయమైన వాటా, సమానత్వం సాధ్యం కాదని అన్నారు.
కులాల వారీ వివరాలు సేకరించాలి.
రాబోయే జనాభా గణనలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ కేటగిరీల కోసం రాష్ట్రాలవారీ జాబితాలతో పాటు, కేటగిరీ మరియు కులం కోసం ప్రత్యేక డ్రాప్‌డౌన్ ఆప్షన్లు చేర్చాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందని కొప్పుల రాజు తెలిపారు. ఎస్సీ ఎస్టీ ఓబిసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వర్గీకరణ, రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఇప్పటికే కేటగిరీలకు సంబంధించిన జాబితాలు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. కాబట్టి కులాల వారీగా వివరాలను నమోదు చేయడం పెద్ద సమస్య కాదని పేర్కొన్నారు.
ఇంకా సమయం ఉందని, హౌస్‌లిస్టింగ్ దశలో ఇప్పటివరకు కుల సంబంధిత వివరాలను సేకరించలేదని ఆయన తెలిపారు. జనాభా లెక్కల (పాపులషన్ ఏనుమేరేషన్ ) ప్రక్రియ 2027 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నందున, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కులాల వారీ వివరాలను జనాభా గణనలో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఓబీసీ ల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి
ఓబీసీ సాధికారత పేరుతో ప్రకటనలు చేయడం, ఆచరణలో మాత్రం వారి హక్కులను బలహీనపరచడం బీజేపీకి ఒక స్థిరమైన విధానంగా మారిందని కొప్పుల రాజు విమర్శించారు. కుల గణన ద్వారా అందుబాటులోకి వచ్చే వాస్తవ గణాంకాల ఆధారంగా విధానాలను రూపొందించి, అణగారిన మరియు వెనుకబడిన వర్గాలకు వారి జనాభా, అవసరాలకు అనుగుణంగా న్యాయమైన వాటా, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కొప్పుల రాజు అన్నారు.
