మేధావుల గళం.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా!
ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ భాగస్వాములు కావాలి
లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ అధ్యక్షతన మేధావుల సమావేశం శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణానికి చెందిన ప్రముఖులు, విద్యావంతులు, న్యాయవాదులు, మేధావులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, లెక్చరర్లు, వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఓటరు హక్కులు, దేశ భద్రత తదితర అంశాలపై మేధావులు తమ అభిప్రాయాలను, సూచనలను ఎంపీ ముందు వెల్లడించారు. ఒక్కొక్కరి అభిప్రాయాలను శ్రద్ధగా విన్న ఎంపీ వాటన్నింటినీ నోట్ చేసుకున్నారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు, సూచనలను తప్పకుండా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.
అనంతరం ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..... ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే అరాచక శక్తులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశంలోకి ఇతర దేశాలకు చెందిన దుష్టశక్తులు ప్రవేశించకుండా, ప్రతి అర్హుడైన పౌరుడికి పారదర్శకంగా ఓటు హక్కు కల్పించాలనే సంకల్పంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియను చేపట్టినట్లు వివరించారు. గతంలో ఈ ప్రక్రియ ఏడుసార్లు నిర్వహించగా, ప్రస్తుతం చేపట్టినది ఎనిమిదోసారి అని తెలిపారు.
దేశ ప్రజాస్వామ్యాన్ని, భారతదేశ సమగ్రతను, మన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మేధావులు, విద్యావంతులు సమాజంలో చైతన్యం తీసుకువచ్చేలా తమ వంతు కృషి చేయాలని కోరారు. ప్రజలు వ్యక్తపరిచిన అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్, తాండూర్ పట్టణానికి చెందిన ప్రముఖులు, మేధావులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
