- District News
- ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు
సంగారెడ్డి జూనియర్ సివిల్ జడ్జి కమ్ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి శ్రీమతి టి. కలిందింది దుర్గారాణి హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయులకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
విద్యార్థులు తమ హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగ విలువలు మరియు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా బాలల హక్కులు, బాల్య వివాహాల నిషేధం, బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం , బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మహిళలు మరియు బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలపై వివరించారు.ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, వ్యక్తిగత సమాచార భద్రత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలు పంచుకోకూడదని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని, సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.
అదేవిధంగా విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని తెలిపారు. చట్టం ప్రతి ఒక్కరికీ సమాన రక్షణ కల్పిస్తుందని, అవసరమైన వారికి ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
జాతీయ న్యాయ సేవల సంస్థ , తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ , జిల్లా న్యాయ సేవల సంస్థ ద్వారా అందించే ఉచిత న్యాయ సహాయం, సలహాలు మరియు ఇతర న్యాయ సేవలను ప్రజలు, ముఖ్యంగా అర్హులైన విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యులు వినియోగించుకోవాలని సూచించారు.విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని, చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యతను కూడా పెంపొందించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. ప్రతి విద్యార్థి చట్టాలను తెలుసుకొని, ఇతరుల హక్కులను గౌరవిస్తూ మంచి పౌరుడిగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుల సేవలను అభినందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులకు న్యాయ అవగాహన కల్పించడంలో పాఠశాలలు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని తెలిపారు.కార్యక్రమంలో పాఠశాలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. న్యాయ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థులకు చట్టపరమైన అంశాలపై విలువైన సమాచారం అందిందని పాఠశాల సిబ్బంది తెలిపారు.
