జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.

ఓపీ, ఐపీ సేవలతో పాటు సర్జరీలు, ప్రసవాల సంఖ్య పెంచాలి. ఆసుపత్రి పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.

85 పడకల నూతన ఆసుపత్రి భవనం వద్ద అంతర్గత రహదారులు, లైటింగ్ ఏర్పాటు చేయాలి* రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
Published On
జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.

----------------------------------------
రామగుండం,  సెప్టెంబర్ 18:(లోకల్ గైడ్ )
----------------------------------------
రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు, ఓపీ, ఐపీ సేవలు, సర్జరీలు, ప్రసవాల నిర్వహణ, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుతున్న వైద్య సేవలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రతిరోజూ సుమారు 1,500 నుంచి 1,600 మంది వరకు అవుట్ పేషెంట్లు వస్తున్నందున, ఓపీ సేవలను మరింత మెరుగుపరచాలని  సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఇన్‌పేషెంట్ సేవలను కూడా మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.

ఆసుపత్రిలో చేపట్టిన పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి రోగులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సర్జరీలు, ప్రసవాల సంఖ్య పెంచాలి

గోదావరిఖని జనరల్ ఆసుపత్రి పరిధిలో సర్జరీల సంఖ్యను పెంచాలని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే అత్యధిక సంఖ్యలో ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని  ఆదేశించారు.

వైద్య కళాశాల అందుబాటులో ఉండటంతో అన్ని విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నారని, వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకొని క్రమం తప్పకుండా సర్జరీలు నిర్వహించేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య నిపుణుల సేవలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.

ఆసుపత్రి సమీపంలోని డ్రైనేజీ బ్లాకేజీలను వెంటనే తొలగించాలని  ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాల్లో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిరంతరం పారిశుధ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ రోగులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని తెలిపారు.

నూతన ఆసుపత్రి భవనం వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలి.

85 పడకల నూతన ఆసుపత్రి భవనం వద్ద అవసరమైన అంతర్గత రహదారులు, లైటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని  సూచించారు. ఎస్‌టీపీ సమీపంలో అవసరమైన లెవలింగ్ పనులను చేపట్టి, ఆసుపత్రికి వచ్చే రోగులు, వైద్య సిబ్బందికి రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో ఆసుపత్రి సూపరింటెండెంట్
 డా. హిమబిందు, ఆర్‌ఎంఓ డా. కృప బాయి, టీజీఎంఐడీసీ ఏఈ విక్రమ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.
--------------------------------------------------------------------

Tags:

About The Author

Latest News