- District News
- అమర పోలీసు వీరులకు ఘన నివాళి: వికారాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో బృహత్ రక్తదాన శిబిరం
అమర పోలీసు వీరులకు ఘన నివాళి: వికారాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో బృహత్ రక్తదాన శిబిరం
సమాజ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమర పోలీసు వీరుల స్మృత్యర్థం వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బృహత్ రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కొండ బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో బుధవారం ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. "త్యాగమూర్తులను స్మరించుకుందాం - అమర పోలీసు వీరులకు నివాళులర్పిద్దాం" అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని విద్యార్థులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు మరియు యువత విశేషంగా పాల్గొన్నారు.
పోలీసుల త్యాగాలు అమూల్యమైనవి: ఎస్పీ స్నేహ మెహ్రా
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా గారి నేతృత్వంలో ఈ రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... "విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు అమూల్యమైనవి. వారి స్మరణార్థం రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గర్వకారణం" అని తెలిపారు. ప్రాణాపాయంలో ఉన్నవారికి సమయానికి రక్తం అందించడం ద్వారా మరొకరికి పునర్జన్మ ఇచ్చినట్లవుతుందని ఆమె పేర్కొన్నారు.
విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల విశేష భాగస్వామ్యం
ఈ శిబిరంలో వికారాబాద్‌లోని పలు ఆసుపత్రులకు చెందిన వైద్యులు మరియు వైద్య సిబ్బంది పాల్గొని రక్తసేకరణ ప్రక్రియను పర్యవేక్షించారు. అలాగే జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువకులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా రక్తదానం చేశారు.
ప్రజల నుండి విశేష స్పందన
సమాజ శ్రేయస్సు కోసం పోలీస్ శాఖ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ, అలాగే కార్యక్రమ జయప్రదానికి సహకరించిన వైద్యులను, స్వచ్ఛంద సంస్థలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా గారు రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలు అందచేసి ప్రత్యేకంగా అభినందించి, ధన్యవాదాలు తెలిపారు.
