- District News
- గిరిజన గర్భిణులకు వరంగా చర్ల సీహెచ్‌సీ
గిరిజన గర్భిణులకు వరంగా చర్ల సీహెచ్‌సీ
Published On
By Ram Reddy
మారుమూల గిరిజన ప్రాంతమైన చర్లలో మాతా శిశు వైద్య సేవలు గణనీయంగా బలోపేతమవుతున్నాయి. గతంలో నెలకు 3–4 ప్రసవాలు మాత్రమే జరిగే చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం నెలకు సుమారు 50 ప్రసవాలు జరిగే స్థాయికి సేవలు విస్తరించాయి. దీంతో గర్భిణులు అత్యవసర సమయంలో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, స్థానికంగానే ప్రసూతి వైద్య సేవలు పొందుతున్నారు. గత సెప్టెంబర్‌లో చర్ల సీ హెచ్ సీలో మొత్తం 46 ప్రసవాలు జరగగా, అందులో 30 సాధారణ ప్రసవాలు, 16 సిజేరియన్ ప్రసవాలు ఉన్నాయి. అదేవిధంగా 8 హైరిస్క్ ప్రసూతి కేసులకు సకాలంలో వైద్య సేవలు అందించారు. వీటిలో 4 ప్రీ-ఎక్లాంప్సియా, ఒక ఎక్లాంప్సియా, ఒక అబ్రప్షియో ప్లాసెంటా, ఒక గ్రాండ్ మల్టీపారా, ఒక అబ్స్ట్రక్టెడ్ లేబర్ కేసు ఉన్నాయి. చర్ల నుంచి భద్రాచలం సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అత్యవసర ప్రసూతి పరిస్థితుల్లో గోల్డెన్ అవర్స్‌లోనే వైద్యం అందించడం కీలకంగా మారింది. హైరిస్క్ కేసులను అవసరమైనప్పుడు స్థానికంగానే నిర్వహించడం, అత్యవసర సిజేరియన్ సేవలు అందుబాటులో ఉండటంతో రిఫరల్స్ తగ్గుతున్నాయి. గర్భిణులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీఐఎఫ్ఎఫైఏ స్కాన్, ఎ ఏ న్ సీ స్కాన్ సేవలను కూడా చర్ల సీ హెచ్ సీ లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ ప్రాతిపదికన గైనకాలజిస్ట్, అనస్థీషియాలజిస్ట్, రెగ్యులర్ ప్రాతిపదికన పీడియాట్రిషియన్ సేవలు అందిస్తున్నారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది సమన్వయంతో సాధారణ ప్రసవాలు, సిజేరియన్లు, ట్యూబెక్టమీతో పాటు హైరిస్క్ కేసులకు వైద్యం అందిస్తున్నారు. చర్లలో వైద్య సేవల బలోపేతానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రత్యేక దృష్టి సారించారు. వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు, అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక వసతులు, నర్సింగ్ సిబ్బంది తదితర అంశాలపై చర్యలు తీసుకుంటున్నారు. డీసీహెచ్ఎస్ డా. జి. రవి బాబు పర్యవేక్షణ, పీ హెచ్ సీ సూపరింటెండెంట్ డా. సాయి వర్ధన్ ఆధ్వర్యంలోని వైద్య, నర్సింగ్ సిబ్బంది సమిష్టి కృషితో ప్రసూతి సేవలు మరింత విస్తరించాయి. ఇటీవల 30 పడకల చర్ల ఆసుపత్రి భవన నిర్మాణ ప్రారంభోత్సవానికి హాజరైన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ద్వారా చర్ల ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను తెలుసుకుని సిబ్బందిని అభినందించారు. మారుమూల గిరిజన ప్రాంతంలో స్థానికంగానే నాణ్యమైన ప్రసూతి సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకం పెరుగుతోంది.
Tags:
About The Author
Related Posts
Latest News
11 Oct 2026 22:16:09
కారేపల్లి, అక్టోబర్ 11 (లోకల్ గైడ్ న్యూస్):
దసరా పండుగను పురస్కరించుకుని శరన్నవరాత్రుల సందర్భంగా కారేపల్లి మండలం గోవిందుతండా గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరి
