విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలి  జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Published On
విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలి  జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, 9 లోకల్ గైడ్

కామారెడ్డి జిల్లా ,లింగంపేట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించి, పాఠశాలలో విద్యార్థినులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్, వారికి అందిస్తున్న భోజన సదుపాయాలు, విద్యాబోధన, వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకుని, వారి అభిప్రాయాలను ఆసక్తిగా విన్నారు.
అనంతరం పాఠశాలలోని నిల్వ గది, కళా గదులను పరిశీలించారు. విద్యార్థినులు, పాఠశాల సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడుతూ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. పాఠశాలలో కొనసాగుతున్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఉప ఇంజినీరింగ్ అధికారిని ఆదేశించారు. అలాగే, విద్యార్థినులకు మెరుగైన క్రీడా వసతులు కల్పించేందుకు పాఠశాల ఆటస్థలాన్ని చదును చేయడానికి రూ.3 లక్షల నిధులను మంజూరు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన భోజనం, సౌకర్యవంతమైన వసతి అందేలా చూడాలని తెలిపారు. విద్యార్థినులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణించేలా ప్రోత్సహించాలని, పాఠశాలలో చేపట్టిన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థినుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మల్లికార్జున్, ఎల్లారెడ్డి ఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, మండల విద్యాధికారి, పాఠశాల ప్రత్యేక అధికారి, గ్రామ సర్పంచ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News