- District News
- గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి
గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి
కార్యకర్తలకు బీఆర్‌ఎస్ నాయకుడు జూపల్లి రమణారావు పిలుపు
లోకల్ గైడ్ : అశ్వారావుపేట
రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్ట
భద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులుకోఆర్డినేటర్ జూపల్లి రమణారావు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అశ్వారావుపేట మండల వ్యాప్తంగా ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ఓటర్ల నమోదు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కును పొందాలని ఆకాంక్షించారు. అర్హులైన పట్టభద్రులు తమ సాధారణ ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు డిగ్రీ మెమో, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను జతచేసి సమీపంలోని కేంద్రాల్లో ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యేలా పాత్రికేయులు సైతం విస్తృతంగా కథనాలు ప్రచురించి అవగాహన కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటున్న రాకేశ్ రెడ్డికే పార్టీ అధిష్ఠానం మరోసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తోందని జూపల్లి స్పష్టం చేశారు. పార్టీ కేడర్ అంతా ఐక్యంగా శ్రమించి, భారీ సంఖ్యలో ఓటర్లను నమోదు చేయించి రాకేశ్ రెడ్డి ఘన విజయానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు.
ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు విలేకరులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై పాత్రికేయులు ప్రశ్నించగా, ఆ అంశాన్ని ఇప్పటికే పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లామని ఆయన వివరించారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయాన్ని త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, కలపాల బాబురావు, సంకా ప్రసాద్, వెంకన్న బాబు, తూంపాటి రమేష్, సాదు జోస్నాబాయి, ప్రసాదు, ఆసిఫ్, బుజ్జి బాబు బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
