- District News
- ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఒక దుకాణం సీజ్
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఒక దుకాణం సీజ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం వివిధ హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ. శరత్ తన బృందంతో కలిసి ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలు, ఆహార భద్రతా ప్రమాణాల అమలును పరిశీలించారు. ఈ తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన ఒక దుకాణాన్ని సీజ్ చేయడంతో పాటు, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశిస్తూ నోటీసు జారీ చేశారు. అలాగే, పరిశుభ్రత లోపాలు, ఇతర ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన మూడు హోటళ్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. నిర్దేశించిన సమయంలోగా లోపాలను సరిదిద్దుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. తనిఖీల్లో భాగంగా వివిధ ఆహార పదార్థాలకు సంబంధించి ఏడు నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ. శరత్ సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
