- District News
- Khammam
- అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం!
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం!
ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి – కామేపల్లి శిశు అభివృద్ధి పథక అధికారికి ఐఎఫ్‌టీయూ వినతి
కారేపల్లి, అక్టోబర్ 26 (లోకల్ గైడ్):
అంగన్వాడీ ఉపాధ్యాయులు, సహాయకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ సుభహాన్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ప్రగతిశీల అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం కామేపల్లి ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో శిశు అభివృద్ధి పథక అధికారి ఉమాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా షేక్ సుభహాన్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, సహాయకుల శ్రమను ప్రభుత్వం గుర్తించాలని, వారిపై అదనపు పనిభారం మోపుతూ వేధింపులకు గురిచేయడం తగదన్నారు. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, శిథిలావస్థలో ఉన్న కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించి, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు, ఉద్యోగులకు భవిష్య నిధి, ఉద్యోగుల రాజ్య బీమా, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన అంగన్వాడీ ఉద్యోగులకు పెండింగ్ ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని, పదవీ విరమణ ప్రయోజనాలను రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తలపై కొందరు పర్యవేక్షకులు చేస్తున్నట్లు వస్తున్న వేధింపుల ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సంరక్షణ అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వాటికి అవసరమైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం అన్యాయమన్నారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయకుండా మహిళా, శిశు సంక్షేమం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను కేవలం వినతిపత్రాలకే పరిమితం చేయకుండా ప్రభుత్వం తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు, సహాయకులను సమీకరించి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం కామేపల్లి ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి శిరోమణి, నాయకులు లక్ష్మీమణి, విజయ, కమల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
