దళారి ఉచ్చులో రైతు విలవిల.. పెట్టుబడిదారుల చేతిలో పంట సాగు!

అప్పుల ఊబిలో ఏజెన్సీ రైతులు.. పండించిన పంటకు ధర నిర్ణయించేది దళారీలే

ప్రతి మండల కేంద్రంలో కోల్డ్‌స్టోరేజ్‌లు ఏర్పాటు చేసి రైతుకే పంట విక్రయ హక్కు కల్పించాలి
Published On
దళారి ఉచ్చులో రైతు విలవిల.. పెట్టుబడిదారుల చేతిలో పంట సాగు!

 

 

 

కారేపల్లి (సింగరేణి ), సెప్టెంబర్ 5, లోకల్ గైడ్ న్యూస్ : ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్న రైతు చివరకు దళారి చేతిలో దగా అవుతున్నాడని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతే రాజు అని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేస్తున్న గిరిజన రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తూ అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పనిముట్లు, కూలీల ఖర్చులకు ప్రభుత్వ రుణాలు సకాలంలో అందకపోవడంతో రైతులు పెట్టుబడిదారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపింది. పంట పండిన తర్వాత అదే పెట్టుబడిదారుడు ముందుగా ఇచ్చిన అప్పును సాకుగా చూపి మార్కెట్ ధర కంటే తక్కువకే పంటను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించింది.

అప్పు ఒక వైపు.. పంట ధర మరో వైపు

ప్రైవేట్ పెట్టుబడిదారుల వద్ద తీసుకున్న అప్పుకు అధిక వడ్డీ చెల్లించడంతో పాటు, పంటను కూడా వారి నిర్ణయించిన ధరకే విక్రయించాల్సి రావడంతో రైతుకు న్యాయమైన ఆదాయం దక్కడం లేదని పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, వరదలు, తెగుళ్ల కారణంగా పంట నష్టపోయినా అప్పు మాత్రం రైతు నెత్తినే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఒక పంటకు తీసుకున్న అప్పు తీర్చేందుకు మరో పంట సాగు చేయడం.. మళ్లీ అదే పెట్టుబడిదారుడి వద్ద అప్పు చేయడం వంటి పరిస్థితి కొనసాగుతోందని తెలిపింది.

ప్రతి మండలంలో రెండు కోల్డ్‌స్టోరేజీలు ఏర్పాటు చేయాలి

రైతులకు పంటను వెంటనే తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి లేకుండా ప్రతి మండల కేంద్రంలో కనీసం రెండు కోల్డ్‌స్టోరేజీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. వీటిపై దళారీల ప్రమేయం లేకుండా పూర్తిస్థాయి హక్కులు రైతులకే కల్పించాలని కోరింది. రైతు తన పంటను ఎక్కడ, ఎప్పుడు, ఏ ధరకు అమ్ముకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కల్పించాలని పేర్కొంది.

రైతులకు రుణాలు.. పంటకు భరోసా కావాలి

ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.2 లక్షల వరకు సున్నా వడ్డీ రుణం అందించాలని, బ్యాంకుల ద్వారా రుణాలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందించాలని కోరింది. పంట వేసి నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, పంట బీమా, రైతు భరోసా వంటి పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించింది.

దళారి వ్యవస్థను రద్దు చేసి.. రైతు చేతిలోనే వ్యవసాయాన్ని ఉంచాలి

వ్యవసాయ అధికారులు ప్రతి పంటపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, రైతు సహకార సంఘాలను బలోపేతం చేసి రైతుల ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌కు చేరేలా చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. దళారి వ్యవస్థను పూర్తిస్థాయిలో రద్దు చేసి.. ప్రతి గింజను రైతు తన ఇష్టానుసారం విక్రయించుకునే హక్కును ప్రభుత్వం కల్పించాలని కోరింది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల్లో పెట్టుబడిదారుల ఆధీనంలో సాగు చేస్తున్న రైతులకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. “రైతు బాగుపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. వ్యవసాయం రైతు చేతిలోనే ఉండాలి.. పెట్టుబడిదారుల చేతుల్లో బందీ కాకూడదు” అని సంఘం పేర్కొంది.

Tags:

About The Author

Latest News

_షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._ _షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
  ములుగు జిల్లా ఏటూరు నాగారం లోకల్ గైడ్  _ఏటూరునాగారం మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్‌ ఐటీఐ వెనుక నివాసం ఉంటున్న ఇర్పా సుజాత–నరేష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్
ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 
జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు 
పంచాయతీ సిబ్బందికి సైకిళ్లు బహూకరించి ఘన సన్మానం