దేశభక్తి చాటిన వేళ.. విద్యార్థుల భవిష్యత్తుకు బాసట!

ప్రతిభావంతులకు మండేపూడి అరుణ ఆర్థిక ప్రోత్సాహం.. గేట్ కారేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Published On
దేశభక్తి చాటిన వేళ.. విద్యార్థుల భవిష్యత్తుకు బాసట!

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగష్టు 15 :మండలంలోని గేట్ కారేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులతో దేశభక్తి ప్రతిజ్ఞ చేయించారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మండేపూడి వెంకటప్పారావు (పెద్దబాబు) జ్ఞాపకార్థం ఆయన భార్య మండేపూడి అరుణ విద్యార్థుల భవిష్యత్తుకు బాసటగా నిలిచారు. గేట్ కారేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు.

ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రూ.2,000 చొప్పున, తృతీయ ర్యాంకు సాధించిన విద్యార్థులకు రూ.1,000 చొప్పున నగదు బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ ఆధ్వర్యంలో గేట్ కారేపల్లి సర్పంచ్ పూసం ఎల్లయ్య, ఉపసర్పంచ్ కందుల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు.

2024–25 పదో తరగతి బ్యాచ్‌లో భూక్యా ఇందు ప్రథమ ర్యాంకు, భూక్యా సాయితేజ ద్వితీయ ర్యాంకు, భూక్యా జీవన్ తృతీయ ర్యాంకు సాధించారు. 2025–26 బ్యాచ్‌లో ఎం. భానుప్రసాద్ ప్రథమ ర్యాంకు, ఏ. హరీష్ ద్వితీయ ర్యాంకు, జి. వివేక్ తృతీయ ర్యాంకులు సాధించి నగదు బహుమతులు అందుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఆనంద్ మాట్లాడుతూ విద్యార్థుల పట్ల మండేపూడి అరుణ చూపిస్తున్న ప్రేమ, అభిమానం, సేవాభావం అభినందనీయమన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఆర్థికంగా ప్రోత్సహించడం ద్వారా వారి చదువుపై మరింత ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు గ్రామ ప్రజలు కూడా ముందుకు వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Tags:

About The Author

Latest News