- District News
- Khammam
- విద్యార్థుల క్రీడా ప్రతిభకు ‘చంద్రు ఫౌండేషన్’ అండ
విద్యార్థుల క్రీడా ప్రతిభకు ‘చంద్రు ఫౌండేషన్’ అండ
స్పోర్ట్స్ యూనిఫాం అందజేత.. సేవా కార్యక్రమాలను అభినందించిన ఎంఈఓ దుగ్గిరాల జయరాజు
ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్, ఆగష్టు 12 : విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు చంద్రు ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కారేపల్లి మండల విద్యాశాఖ అధికారి దుగ్గిరాల జయరాజు అన్నారు. సూర్య తండలోని ఎంపీయూపీఎస్ పాఠశాల విద్యార్థులకు చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా యూనిఫాం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక జత స్పోర్ట్స్ యూనిఫాం అందజేశారు. సింగరేణి మండల విద్యాశాఖ అధికారి దుగ్గిరాల జయరాజు చేతుల మీదుగా, స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హార్జ్యకు యూనిఫాంలను అందించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ దుగ్గిరాల జయరాజు మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకుని తమకు సాధ్యమైన మేరకు ఇతరులకు సహకరించాలని సూచించారు. విద్యార్థుల అభివృద్ధి కోసం చంద్రు ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆదర్శవంతంగా ఉన్నాయని ప్రశంసించారు. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, అలాంటి కార్యక్రమాలకు చేయూతనివ్వడం అభినందనీయమన్నారు.
విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రి, యూనిఫాంలను అందించడం ద్వారా వారి ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ విద్యార్థులు, పాఠశాలల అభివృద్ధికి తోడ్పడుతున్న చంద్రు ఫౌండేషన్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం పాఠశాల తరఫున చంద్రు ఫౌండేషన్ సభ్యులకు ఎంఈఓ దుగ్గిరాల జయరాజు సన్మానం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వనజ, సుజాత, విజయలక్ష్మి, శోభారాణి, పంచాయతీ కార్యదర్శి భార్గవి, ఫౌండేషన్ సభ్యులు రవి, పృథ్వీరాజ్, అఖిల్, రమేష్, విద్యార్థుల తల్లిదండ్రులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
