సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు పంచాయతీ ప్రణాళికలే కీలకం : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

ప్రతి మండలం రెండు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యం

Published On
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు పంచాయతీ ప్రణాళికలే కీలకం : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

 

 

కొత్తగూడెం : లోకల్ గైడ్ (జిల్లా బ్యూరో) :
2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లా, మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డీ జీ ఎస్) అమలుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యాచరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి మండలం 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో రెండు లక్ష్యాలను ప్రాధాన్యత అంశాలుగా ఎంపిక చేసి, వాటికి అనుగుణంగా కనీసం 25 శాతం ప్రాజెక్టు ఆధారిత కార్యక్రమాలను మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో తప్పనిసరిగా చేర్చాలని సూచించారు. గ్రామాల అవసరాలు, స్థానిక పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళా సాధికారత, పచ్చదనం, సామాజిక న్యాయం, సుపరిపాలన వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.‌ గ్రామీణ పర్యాటకం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, విలువ ఆధారిత వ్యవసాయం, పశుసంవర్థక అభివృద్ధి, సేంద్రీయ వ్యవసాయం, గ్రామ ఉత్పత్తుల బ్రాండింగ్, జియో ట్యాగింగ్, మహిళా స్వయం సహాయక సంఘాల ఆదాయ వృద్ధి కార్యక్రమాలను ప్రణాళికల్లో చేర్చాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఫండ్ కన్వర్జెన్స్ ద్వారా గ్రామాల సమగ్రాభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా ప్రణాళిక అధికారి సునీత, జిల్లా పంచాయతీ అధికారి అనూష, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News