- District News
- Khammam
- గదేపాడులో ఓటర్ల జాబితాపై గ్రామసభ
గదేపాడులో ఓటర్ల జాబితాపై గ్రామసభ
సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ల సవరణపై అవగాహన
లోకల్ గైడ్, కారేపల్లి, ఆగష్టు 27 :
సింగరేణి మండలం గదేపాడు గ్రామపంచాయతీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై గురువారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఓటర్ల జాబితా పరిశీలన, పేర్ల అనుసంధానం, అర్హులైన ఓటర్ల నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణలో భాగంగా ఓటర్ల వివరాలను ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు. పేర్ల అనుసంధానంలో సమస్యలు ఉన్న వారికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని, సంబంధిత అధికారులు నోటీసులు అందించిన వారు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కోరారు. తద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఓటర్ల నమోదు అధికారి శ్రీనివాసరావు ఓటర్ల జాబితాలోని పేర్లను చదివి వినిపిస్తూ వివరాలను పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి ఓటరు కార్యాలయానికి వచ్చి ముసాయిదా జాబితాలో తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు సక్రమంగా నమోదయ్యాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులైన వారు కొత్త ఓటు నమోదు దరఖాస్తు ద్వారా తమ పేరును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం ఆధార్ కార్డు, పదో తరగతి ధ్రువపత్రం, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, కుటుంబ సభ్యుల్లో ఒకరి ఓటరు గుర్తింపు కార్డు ప్రతితో పాటు అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించారు. అర్హత కలిగిన యువతీ యువకులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ కోరారు. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నన్నెబోయిన ఉపేందర్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్ల నమోదు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
