- District News
- Khammam
- లక్షల వసూళ్లు... కనీస వసతులు శూన్యం!
లక్షల వసూళ్లు... కనీస వసతులు శూన్యం!
కోట మైసమ్మ జాతరలో వ్యాపారుల ఆవేదన
కారేపల్లి, అక్టోబర్ 23 (లోకల్ గైడ్ న్యూస్ ):
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి శ్రీ కోట మైసమ్మ అమ్మవారి వార్షిక జాతరలో కనీస సౌకర్యాలు లేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరలో దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారుల నుంచి గజానికి రూ.500 చొప్పున వసూలు చేస్తున్నప్పటికీ, కనీస వసతులు కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం సమకూరుతున్నా వ్యాపారులకు అవసరమైన సౌకర్యాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదని ఆరోపిస్తున్నారు.
వసూళ్లు భారీగా.. వసతులు అంతంతే!
జాతరలో వందలాది దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారులు దూర ప్రాంతాల నుంచి వచ్చి తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే తాగునీటి సౌకర్యం లేకపోవడం, మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో ముఖ్యంగా మహిళా వ్యాపారులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉన్న మరుగుదొడ్లకు సైతం తాళాలు వేసి ఉంచడంతో అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. ప్రతి ఏటా జాతర సమయంలో ఇదే పరిస్థితి ఎదురవుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రివేళల్లో రక్షణ కరువు
జాతరలో రాత్రి వేళల్లో కొందరు ఆకతాయిలు మద్యం మత్తులో గొడవలకు దిగుతూ, దుకాణాల వద్ద అసౌకర్యం కలిగిస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. దుకాణాల్లోని సామగ్రి చోరీకి గురవుతున్నా తగిన రక్షణ లేదని పేర్కొంటున్నారు. వ్యాపారులకు భద్రత కల్పించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జాతర ప్రాంగణాన్ని నిరంతరం పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్
జాతర ముగిసిన అనంతరం వచ్చే ఏడాది మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నప్పటికీ, ఆచరణలో మార్పు కనిపించడం లేదని వ్యాపారులు అంటున్నారు. సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందించినా సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జాతర ప్రాంగణం చుట్టూ శాశ్వత ప్రహరీ గోడ నిర్మించాలని, తాగునీటి వసతి కల్పించాలని, మరుగుదొడ్లను నిరంతరం వినియోగంలో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల నిఘా, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు, వ్యాపారులకు కనీస సౌకర్యాలు కల్పించడంతోపాటు, జాతర ద్వారా వచ్చే ఆదాయానికి అనుగుణంగా దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా దేవదాయ శాఖ అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
