- District News
- హకీంపేట్ బాధితుడిని మిషన్ హాస్పిటల్లో పరామర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హకీంపేట్ బాధితుడిని మిషన్ హాస్పిటల్లో పరామర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో భూ నిర్వాసిత రైతు ఆత్మహత్యాయత్నం
-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన భూమిని ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందనే తీవ్ర మనోవేదనతో హకీంపేట్ గ్రామానికి చెందిన వెంకటయ్య (47) అనే రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మిషన్ ఆసుపత్రికి వెళ్లి, చికిత్స పొందుతున్న రైతు వెంకటయ్యను పరామర్శించారు. డాక్టర్ అవినాష్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బాధితుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమకు చెందిన 6 ఎకరాల 19 గుంటల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని, అయితే ఇప్పటివరకు తగిన నష్టపరిహారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి వచ్చిన పంట సాగులో ఉన్న పొలాన్ని రాత్రికి రాత్రే జేసీబీలతో చదును చేయడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు.
ప్రభుత్వాన్ని నిలదీసిన సబితా ఇంద్రారెడ్డి
ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "రైతులకు ఏవైనా సమస్యలు వస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు. కానీ, ప్రభుత్వమే స్వయంగా రైతుల పొలాలను లాక్కుని అన్యాయం చేస్తే.. అన్నదాతలు ఎవరిని ఆశ్రయించాలి?" అని ప్రశ్నించారు. వెంటనే స్పందించి బాధిత రైతుకు మెరుగైన వైద్యం అందించాలని, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఫోన్ చేసి రైతుల భూమి సమస్య ఏమైనా ఉంటే పరిష్కరించాలని కోరారు ఆయన కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేసి ఆసరాగా నిలవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పరిగి శాసనసభ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, తాండూర్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, మాజీ బీసీ కమిషన్ శుభ ప్రద్ పటేల్ సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగేందర్ గౌడ్ వికారాబాద్ మునిసిపల్ మాజీ కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
