- District News
- Nalgonda
- రెడ్‌క్రాస్‌కు తొలి మహిళా చైర్‌పర్సన్.
రెడ్‌క్రాస్‌కు తొలి మహిళా చైర్‌పర్సన్.
హేమలత ప్యానెల్‌కు 8 స్థానాలు.. అమరేందర్ రెడ్డి ప్యానెల్‌కు 7.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.
నల్గొండ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో నూతన నాయకత్వం కొలువుదీరింది. సుమారు 12 ఏళ్లుగా ఎన్నికలు లేకుండా కొనసాగుతున్న నిర్వహణ వ్యవస్థకు ఈసారి ఎన్నికలతో మార్పు వచ్చింది. ఆదివారం నిర్వహణ కమిటీ సభ్యుల ఎన్నికలు జరగ్గా, సోమవారం కీలక పదవుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. సొసైటీ చైర్‌పర్సన్‌గా డాక్టర్ హేమలత ఎన్నికై చరిత్ర సృష్టించారు. నల్గొండ రెడ్‌క్రాస్ సొసైటీకి తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.
రెండు ప్యానళ్ల మధ్య హోరాహోరీ పోటీ.
రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహణ కమిటీ ఎన్నికల్లో డాక్టర్ హేమలత నేతృత్వంలోని నల్గొండ సేవా సమితి ప్యానెల్, గోలి అమరేందర్ రెడ్డి ప్యానెల్ పోటీ పడ్డాయి. మొత్తం 1,385 30 ఓట్లు ఇన్వాయిడ్ అయ్యాయి. మంది ఓటర్లు ఉండగా, 32 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అక్టోబర్ 11న నిర్వహించిన పోలింగ్‌లో 1,003 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం చేపట్టిన ఓట్ల లెక్కింపులో 15 మంది నిర్వహణ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు.ఫలితాల్లో డాక్టర్ హేమలత నేతృత్వంలోని నల్గొండ సేవా సమితి ప్యానెల్‌కు 8 స్థానాలు దక్కగా, గోలి అమరేందర్ రెడ్డి ప్యానెల్‌కు 7 స్థానాలు లభించాయి. దీంతో రెండు ప్యానళ్ల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. ఒక్కో విడత ఓట్ల లెక్కింపు వెలువడుతున్న కొద్దీ అభ్యర్థులు, వారి మద్దతుదారుల్లో ఉత్కంఠ నెలకొంది.
పది నిమిషాల్లోనే ఏకగ్రీవ ఎంపిక.
నిర్వహణ కమిటీ సభ్యుల ఎన్నికల అనంతరం చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, ట్రెజరర్ తదితర కీలక పదవుల ఎంపికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. సోమవారం నిర్వహించిన ఈ ప్రక్రియలో నామినేషన్ల దాఖలుకు పది నిమిషాల గడువు కేటాయించారు. ఆయా పదవులకు పోటీగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
చైర్‌పర్సన్‌గా డాక్టర్ హేమలత, వైస్ చైర్‌పర్సన్‌గా భీమనపల్లి శ్రీకాంత్, ట్రెజరర్‌గా కుంభం జ్యోతి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా మంచుకొండ చిన్న బిక్షమయ్య ఎంపికయ్యారు.
_సేవల విస్తరణపై ఆశలు.!_
కొత్త కార్యవర్గం ఏర్పాటుతో నల్గొండ రెడ్‌క్రాస్ సొసైటీలో సేవా కార్యక్రమాలు మరింత విస్తరిస్తాయనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. రక్తదాన శిబిరాల నిర్వహణ, రక్తనిధి సేవలు, పేదలకు వైద్య సహాయం, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలను బలోపేతం చేయాల్సిన బాధ్యత కొత్త కమిటీపై ఉంది.ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏర్పడిన నూతన కార్యవర్గం పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ, సభ్యుల సహకారంతో సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని సేవాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
తొలి మహిళా చైర్‌పర్సన్‌గా డాక్టర్ హేమలత ఎన్నిక కావడం ఈసారి ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది...
రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ ప్రేమ్ కుమార్, జిల్లా సహకార అధికారి మమత తెలిపారు. నిర్వహణ కమిటీ సభ్యుల ఎన్నికలతో పాటు కీలక పదవుల ఎంపిక ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేసినట్లు వెల్లడించారు. నూతన కార్యవర్గం రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తరించి, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
