- District News
- Ranga Reddy
- చేయూత పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి..
చేయూత పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి..
గతంలో దరఖాస్తు చేసిన వారికి మళ్లీ అవసరం లేదు
లోకల్ గైడ్ ఆమనగల్లు ఆగస్టు 8:
రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. శనివారం నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ ప్రక్రియను చేపట్టారు. దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి చివరి తేదీ లేదని అధికారులు స్పష్టం చేశారు.
కొత్త పింఛన్ల మంజూరులో ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా, బోదకాలు, డయాలసిస్ బాధితులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే దివ్యాంగుల కేటగిరీలో థాలసీమియా, సికిల్‌సెల్, హిమోఫిలియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఆదాయ పరిమితులు
పింఛన్లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులుగా పరిగణించబడతారు. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు అనర్హులు. అదేవిధంగా మూడు ఎకరాల కంటే ఎక్కువ మాగాణి భూమి లేదా ఏడున్నర ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉన్నవారు అర్హులు కారు.
ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, వైద్యులు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఆయిల్, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్‌ల యజమానులు, వారి తల్లిదండ్రులు కూడా పింఛన్‌కు అనర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వ పింఛన్ లేదా స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్ పొందుతున్న వారు, నాలుగు చక్రాల లేదా భారీ వాహనాలు కలిగి ఉన్నవారు కూడా అర్హులు కారు.
గతంలో దరఖాస్తు చేసిన వారికి మళ్లీ అవసరం లేదు
గతంలోనే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తమ దరఖాస్తు ఇప్పటికే నమోదై ఉందో లేదో సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారుల ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించింది.
కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ప్రభుత్వం సూచించిన వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి వివరాలతో నింపి గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో సమర్పించాలి. పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించారు .
