- District News
- వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు లో తొలి బీసీ ఎమ్మెల్యే : తీన్మార్ మల్లన్న
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు లో తొలి బీసీ ఎమ్మెల్యే : తీన్మార్ మల్లన్న
2028లో తెలంగాణలో బీసీ ప్రభుత్వమే
-
-
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి చౌటుప్పల్ నవంబర్ 6 (లోకల్ గైడ్):
బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా 44వ రోజు పాదయాత్రగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ చేరుకున్నారు.స్థానిక పార్టీ నాయకులు మల్లన్న కు ఘన స్వాగతం పలికారు, అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, చౌటుప్పల్ సెంటర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మల్లన్న ప్రసంగించారు.
సెప్టెంబర్ 17న గోల్కొండ ఖిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర 44వ రోజు సాగుతూ ప్రజా, విద్యార్థి, ఉద్యోగ సమస్యలను తెలుసుకుంటూ చౌటుప్పల్ చేరుకుందని మల్లన్న తెలిపారు.ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న దొరల, రెడ్ల పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
రెడ్డి, వెలమలతో సోపతి వద్దు - ఇడుపు కాయితం పంచాయితీ!
రెడ్డి,వెలమలతో బీసీలకు ఇక సోపతి వద్దని, వాళ్లతో పొత్తు పెట్టుకుంటే వాళ్ల ఆస్తులే పెరిగాయి తప్ప బీసీల జీవితాలు బాగుపడలేదని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు.ఇది రెడ్లకు, వెలమలకు, బీసీలకు మధ్య ‘విడాకుల పంచాయితీ’ అని స్పష్టం చేశారు.
తెలంగాణలో రైతు పథకాల పేరిట రూ. 2,47,000 కోట్లు ఖర్చు పెడితే బలిసినోళ్లకే లాభం జరిగిందని మండిపడ్డారు.ఇటీవల కులగణనలో బయటపడ్డ రేవంత్ రెడ్డి సర్కారు లెక్కల ప్రకారం ఒక్కో రెడ్డి కుటుంబానికి: రూ. 5,94,000 లబ్ధి చేకూరిందని,యాదవుల ఇంటికి రూ. 3,50,421,ముదిరాజుల ఇంటికి రూ. 2,45,904,గౌడుల ఇంటికి: రూ. 2,23,863 మాత్రమే దక్కిందని అన్నారు.భూమి ఎవరి వద్ద ఎక్కువ ఉంటే వారికే ప్రభుత్వ సబ్సిడీలు దక్కుతున్నాయని మల్లన్న తెలిపారు.తెలంగాణలో ప్రతి రెడ్డి తలకాయకు సగటున ఎకరంపావు భూమి ఉంటే, యాదవులకు అర ఎకరం కూడా లేదని, ముదిరాజులకు ముప్పావు ఎకరం, గౌడులకు పావు ఎకరం మాత్రమే ఉందన్నారు
రైతు భరోసతో రెడ్డి ఇంటికి రూ. 14,210 పోతే, బీసీ ఇంటికి దక్కింది రూ. 3,891 మాత్రమే అని అలాగే ఉచిత విద్యుత్ తో రెడ్డి ఇళ్లకు రూ. 12,952 లబ్ధి చేకూరితే, బీసీ ఇళ్లకు రూ. 2,267 మాత్రమే వచ్చిందని తెలిపారు.ఇక పోతే యూరియా సబ్సిడీ రెడ్డి ఇంటికి రూ. 6,476 దక్కితే, బీసీలకు రూ. 3,832 , సన్నవడ్ల బోనస్ రెడ్డి ఇంటికి రూ. 3640 పోతే, బీసీల ఇంటికి రూ. 906 వస్తే,రైతు బీమా రెడ్డి ఇంటికి రూ. 1,157 పోతే, బీసీలకు రూ. 403 మాత్రమే దక్కిందని లెక్కలతో వివరించారు.
పన్నులు సకాలంలో కట్టాలి అని చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో బోర్డులు పెడుతున్న ప్రభుత్వం, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.రాష్ట్రంలో 1.05 కోట్ల కుటుంబాలు కంట్రోల్ బియ్యం తింటూ బతుకుతున్నాయని ఆవేదన చెందారు
అసెంబ్లీ సాక్షిగా రూ. 58,000 కోట్ల బీసీ నిధుల దోపిడీ!
కామారెడ్డి డిక్లరేషన్ పేజ్ నంబర్ 15, పాయింట్ 5 ప్రకారం ఏటా రూ. 20,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో బీసీల సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని మల్లన్న గుర్తుచేశారు.మూడేళ్లలో అరవై వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, కేవలం 2వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు.బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లకు రూ. 1,980 కోట్లు కేటాయించి, ఖర్చు చేసింది రూ. 365 కోట్లు మాత్రమేనని, పాఠశాలల భవనాల నిధులు రూ. 1,600 కోట్లు కాజేశారని చెప్పారు.హాస్టల్ పిల్లల తిండికి రూ. 435 కోట్లు కేటాయించి, రూ. 315 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ. 120 కోట్లు నొక్కేశారన్నారు.గౌడ గీత కార్మికులకు రూ. 70 కోట్లు చెప్పి రూ. 19 కోట్లే ఖర్చు చేసి, రూ. 50 కోట్లు ఎత్తుకెళ్లారన్నారు.చేనేత కార్మికులకు రూ. 300 కోట్లు దారి మళ్లించారని తెలిపారు.మొత్తంగా రూ. 60,000 కోట్లకు గాను కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, బీసీల సొమ్ము రూ. 58,000 కోట్లను దొంగతనంగా ఎత్తుకెళ్లారని మండిపడ్డారు.
మునుగోడులో 1.37 లక్షల బీసీ ఓట్లు... ప్రాతినిధ్యం సున్నా
మునుగోడు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యే కాలేదని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు.కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఇతర పార్టీలు రెడ్లకే టికెట్లు ఇస్తున్నాయని దుయ్యబట్టారు.మునుగోడు మొత్తం ఓట్లు 2,52,699 కాగా,రెడ్డి సామాజికవర్గం ఓట్లు కేవలం 18,433 మాత్రమే అని,బీసీ సామాజికవర్గం ఓట్లు 1,37,871 ఓట్లు ఉన్నాయని అన్నారు.రెడ్లు తమ ఓట్లు తాము వేసుకున్నా డిపాజిట్ కూడా రాదని, అయినా బీసీ ఓట్లతో వారు రాజకీయం చేస్తూ బీసీల పైనే పెత్తనం చెలాయిస్తున్నారని ధ్వజమెత్తారు.
మునుగోడులో ఎమ్మెల్యే కాగల సమర్థులైన బీసీ నాయకులు నరసయ్య గౌడ్, పున్నా కైలాస్ నేత, కర్నాటి విద్యాసాగర్, చెరుకు సుధాకర్, కర్నె ప్రభాకర్, ఈవిఎల్ భాస్కర్, నాగబోయిన రవి, పల్లె రవికుమార్, చెక్క ఐలయ్య వంటి ఎంతోమంది ఉన్నప్పటికీ పార్టీలు వారికి అవకాశం ఇవ్వకుండా కేసులతో వేధిస్తున్నాయని మండిపడ్డారు
రెడ్లు రావులు తమ స్వలాభాల కోసం పార్టీలు మారుతుంటే, బీసీలు మాత్రం తమ ముత్తాతల కాలం నుంచి ఒకే పార్టీ కండువా పట్టుకుని మోసపోతున్నారని, బీసీలు కూడా పార్టీలు మారడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు
1949 నిజాం ఫర్మానాతో 1 కోటి ఎకరాల భూముల స్వాధీనం!
కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాత కొండా వెంకట రంగారెడ్డి అప్పటి రెవెన్యూ మంత్రిగా ఉండి 1949లో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి బీసీల భూములను దొరల పేరిట,రెడ్ల పేరిట ఎక్కించిన దొంగ అని అన్నారు.1949 ఆగస్టు 15న నిజాం 'ఫస్లీ 1358' జాగీర్దారీ రద్దు చట్టం ద్వారా భూములన్నీ పేదలకు చెందేలా ఫర్మానా జారీ చేశారని తెలిపారు.ఇదే విషయాన్ని 8వ తరగతి సాంఘిక శాస్త్రం పార్ట్-2 పుస్తకంలో 101వ పేజీలో స్పష్టంగా రాశారని చూపించారు.సుప్రీంకోర్టు మియాపూర్ భూముల తీర్పులో నిజాం ఫస్లీ 1358 చట్టం ప్రాతిపదికగానే భూములు ప్రభుత్వానికి దక్కాయని గుర్తుచేశారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రాగానే ఇదే చట్టంతో రెడ్లు, వెలమల వద్ద ఉన్న 1 కోటి ఎకరాల భూములను గుంజి బీసీలకు భూమి లేని పేదలకు పంచుతామని ప్రకటించారు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పాలకూరి అశోక్ సార్ను గెలిపించండి!
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను విస్మరించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో రెడ్డి అభ్యర్థిని నిలబెట్టిందని,బీసీలకు ప్రతినిధిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ వారసుడైన పాలకూరి అశోక్ సార్ను కత్తెర గుర్తుపై ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినట్లు ప్రకటించారు.రెడ్లు ఇచ్చే డబ్బులు తీసుకొని, ఓటు మాత్రం కత్తెర గుర్తుపైనే వేయాలని కోరారు
2028లో బీసీ రాజ్యం!
రాష్ట్రంలో పట్టుమని 10 లక్షల జనాభా లేని రెడ్లకు 43 మంది ఎమ్మెల్యేలు ఉంటే, 30 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాడని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు."ఓట్ హమారా.. రాజ్ తుమారా.. నై చలేగా! రెడ్డి రావు జాయేగా.. బీసీ సీఎం ఆయేగా!" అంటూ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి తొలి బీసీ ఎమ్మెల్యే గెలవడం ఖాయమని, తెలంగాణలో బీసీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నరసింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల హనుమాన్లు,రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నరసయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి పిట్టల శంకర్, కొమ్మల ప్రవీణ్ రాజ్,పార్టీ జాతీయ వ్యవహారాల ఇన్చార్జ్ పూజిత,రాష్ట్ర మహిళా నాయకురాలు సునీత,పార్టీ స్టేట్ ఆఫీస్ కోఆర్డినేటర్ లింగం యాదవ్,మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ సతీష్ బాబు, చౌటుప్పల్ మండల అధ్యక్షుడు యాదగిరి, ,మహిళా అధ్యక్షురాలు లలిత,మహిళా నాయకురాలు సుశీల,పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
