హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
హైదరాబాద్, మార్చి 29: నగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ‘యువ భారత్ రన్ 2026’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS), పల్లవి స్కూల్స్ సంయుక్తంగా ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తనయుడు యశస్వి మల్కా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద యువత ఆధారిత ఫిట్‌నెస్ ఉద్యమంగా నిలిచింది. ఈ రన్‌లో 10,000 మందికి పైగా విద్యార్థులు, యువత, కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.
ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ రన్ ఫిట్ ఇండియా మూవ్మెంట్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మద్దతు అందించగా, రెడ్ ఎఫ్ఎం అధికారిక రేడియో భాగస్వామిగా వ్యవహరించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా 5 కిలోమీటర్ల ‘ది ఛాలెంజ్’ (టైమ్‌డ్ రన్), 2 కిలోమీటర్ల ‘రన్ అండ్ బాండ్’ (కుటుంబ సభ్యులు, ప్రారంభికుల కోసం), 500 మీటర్ల ‘యంగ్ రన్నర్స్’ (చిన్నారుల కోసం) విభాగాలు నిర్వహించారు. అన్ని వయసుల వారికి అనుకూలంగా ఈ విభాగాలను ఏర్పాటు చేయడం విశేషం.
రన్‌తో పాటు జుంబా, యోగా వార్మప్ సెషన్స్, హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్, ప్లే జోన్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్స్ వంటి కార్యక్రమాలు పాల్గొన్న వారిని ఆకట్టుకున్నాయి. టైమ్‌డ్ విభాగాల్లో విజేతలకు మొత్తం రూ.1 లక్ష నగదు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మాజీ ఉపరాష్ట్రపత శ్రీ వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు , సినీ నటుడు శర్వానంద్ తదితరులు హాజరయ్యారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కలిసి జెండా ఊపి 2కే, 5కే రన్‌లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు యువత ఆరోగ్యకరమైన అలవాట్లపై ఆధారపడి ఉందన్నారు. ఇది కేవలం పరుగే కాకుండా శక్తివంతమైన ప్రజా ఉద్యమమని అభివర్ణించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం అలవాటు చేసుకోవాలని సూచించారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, యువతలో విదేశీ అలవాట్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాతృభాషలో మాట్లాడడం, తల్లిదండ్రులతో సమయం గడపడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి మంచి అలవాట్లు అలవరుచుకోవాలని సూచించారు. ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు.
సోషల్ మీడియా వినియోగంపై కూడా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ ఉపయోగించాలని సూచించారు. మంచి ప్రవర్తన, క్రమశిక్షణతో జీవించడం ద్వారా భవిష్యత్తు మెరుగవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా యువతలో ఫిట్‌నెస్‌తో పాటు నైతిక విలువలు పెంపొందించాలనే లక్ష్యాన్ని నిర్వాహకులు విజయవంతంగా సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు.
