ఏఐఎస్ఎఫ్ జెండా విద్యార్థులకు అండ

ప్రభుత్వ విద్య పరిరక్షణకు, నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు : ఏఐఎస్ఎఫ్ నాయకులు

Published On
ఏఐఎస్ఎఫ్ జెండా విద్యార్థులకు అండ

 

భద్రాచలం :  లోకల్ గైడ్ :
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అని ఆ సంఘం జిల్లా కార్యదర్శి వరక అజిత్, మాజీ జిల్లా సహాయ కార్యదర్శి సాధనపల్లి సతీష్ అన్నారు. భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా సహాయ కార్యదర్శి సాధనపల్లి సతీష్ అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని తెలిపారు. స్వాతంత్ర్యం, త్యాగాలు, పోరాటాలను లక్ష్యంగా చేసుకుని దేశంలో విద్యార్థుల హక్కుల కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాడుతోందన్నారు. ప్రభుత్వ విద్యా పరిరక్షణ, శాస్త్రీయ విద్య, అందరికీ సమాన విద్యా అవకాశాల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమాలు నిర్వహించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యా విధానం ప్రభుత్వ విద్యారంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ దిశగా తీసుకెళ్లే విధంగా ఉందని వారు విమర్శించారు. విద్యారంగాన్ని కేంద్రీకరించడంతో పాటు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శాస్త్రీయ దృక్పథంతో కూడిన విద్యకు బదులుగా మూఢనమ్మకాలు, పురాణాల వైపు విద్యార్థులను మళ్లించే ప్రయత్నాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షించేందుకు విద్యార్థులంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. దేశంలో తొమ్మిది దశాబ్దాలుగా విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న ఏఐఎస్ఎఫ్‌కు సుదీర్ఘ ఉద్యమ చరిత్ర ఉందని జిల్లా కార్యదర్శి వరక అజిత్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో మరిన్ని సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల హక్కులు, ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News