- District News
- ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన రెవెన్యూ అధికారులు
ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన రెవెన్యూ అధికారులు
సమస్య పూర్వాపరాలు, డిమాండ్లను తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్
చర్ల : లోకల్ గైడ్ :
చర్ల మండలంలోని శ్రీశ్రీశ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి విడిపించాలని మహా రుద్రసేన ఆధ్వర్యంలో కొండా చరణ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని గురువారం రెవెన్యూ అధికారులు సందర్శించారు. దీక్షకు దారితీసిన సమస్య పూర్వాపరాలు, దీక్ష డిమాండ్లను డిప్యూటీ తహసీల్దార్ అడిగి తెలుసుకున్నారు. దీక్షకు సంబంధించిన సమస్యలు, డిమాండ్లను రాతపూర్వకంగా అందజేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీనిపై కొండా చరణ్ సమస్య పూర్వాపరాలు, తమ డిమాండ్లను వివరిస్తూ రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. అనంతరం కొండా చరణ్ మాట్లాడుతూ ఆలయ భూముల పరిరక్షణలో అధికారులు తూతూమంత్రం చర్యలకు పరిమితం కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ, మళ్లీ సమస్యను వివరించాలని కోరడం సమంజసం కాదన్నారు. గతంలో ఇలాంటి తూతూమంత్రం చర్యలను ఎన్నో చూశామని, ఇకనైనా స్థానిక, ఉన్నతాధికారులు స్పందించి ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయ భూములను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకునే వరకు ఆమరణ నిరాహార దీక్షను విరమించే ప్రసక్తే లేదని కొండా చరణ్ స్పష్టం చేశారు. ఆలయ భూములు కబ్జాల నుంచి విముక్తి పొందడం లేదా తన ప్రాణాలు కోల్పోవడం—ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగే వరకు వెనకడుగు వేసేది లేదన్నారు. హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు కబ్జాలకు గురవుతున్న అంశంపై రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు మౌనం వహించడం సరికాదని అన్నారు. ఆలయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాను ప్రాణాలను పణంగా పెట్టి ఆలయ భూముల రక్షణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టానని పేర్కొంటూ, చర్ల మండలంలోని హిందూ సమాజం తమ నైతిక మద్దతును అందించి ఈ ఉద్యమానికి బలం చేకూర్చాలని కొండా చరణ్ కోరారు.
