రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం!

స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసే నాయకుడే కరువా?

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించని ప్రజా, సామాజిక, దళిత సంఘాల నాయకులు. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న స్థానికులు.
Published On
రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం!

లోకల్ గైడ్ /తాండూర్:
దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మునిగిపోయిన వేళ.. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల వేసి నివాళులర్పించే నాయకుడు కూడా లేకపోవడం తీవ్ర విచారకరమైన ఘటనగా మారింది.
దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం ఫలితంగానే నేడు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు. అటువంటి మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను స్మరించుకోవాల్సిన స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు ఒక్క ప్రజా సంఘం, సామాజిక సంఘం లేదా దళిత సంఘం నాయకుడు కూడా ముందుకు రాకపోవడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజ్యాంగ హక్కులను అనుభవిస్తూ.. రాజ్యాంగ నిర్మాతను విస్మరించడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలు ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి.
అంబేద్కర్ పేరు రాజకీయ అవసరాలకు మాత్రమే వినియోగించడం కాకుండా, ఆయన ఆశయాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పలువురు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే సంఘాలు, నాయకులు కనీసం స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించకపోవడం బాధాకరమని అంటున్నారు.
“హక్కులు కావాలి.. స్వేచ్ఛ కావాలి.. సమానత్వం కావాలి అని కోరుకునే మనం, ఆ హక్కులకు రాజ్యాంగపరమైన భరోసా కల్పించిన మహనీయుడిని మాత్రం ఎందుకు విస్మరిస్తున్నాం?” అనే ప్రశ్నకు సమాజం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లేకపోవడం కేవలం ఒక విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు.. రాజ్యాంగ విలువలను, సామాజిక న్యాయ స్ఫూర్తిని స్మరించుకోవాల్సిన సందర్భంలో చోటుచేసుకున్న విషాదకరమైన నిర్లక్ష్యంగా పలువురు అభివర్ణిస్తున్నారు.
రాజ్యాంగ నిర్మాతను గౌరవించడం అంటే కేవలం జయంతి రోజున పూలమాల వేయడం కాదు.. ఆయన అందించిన రాజ్యాంగ విలువలను నిత్యజీవితంలో గౌరవించడం అని అంటున్నారు.

Tags:

About The Author

Latest News