- District News
- Khammam
- కారేపల్లి మండలంలో కోతుల బెడద.. సర్పంచ్‌లకు పట్టింపేదీ?
కారేపల్లి మండలంలో కోతుల బెడద.. సర్పంచ్‌లకు పట్టింపేదీ?
ప్రజలపై కోతుల దాడులు.. గాయపడుతున్నా స్పందన కరువు
ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 14 : కారేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. మండలంలోని ఏదో ఒక గ్రామంలో ప్రతిరోజూ కోతుల దాడులకు గురై ఒకరిద్దరు గాయపడుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోతులు వెంటపడటంతో పరుగులు తీసే క్రమంలో కిందపడిపోయి కాళ్లు, చేతులు విరిగిన వారు ఎందరో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. కోతుల దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారు ప్రభుత్వ దవాఖానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు కోతుల గుంపులు కనిపిస్తే బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
ఇళ్లలోకి చొరబడటం, వీధుల్లో తిరుగుతూ ప్రజలను వెంబడించడం, ఆహారం కోసం వస్తువులను చిందరవందర చేయడం వంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. కోతుల దాడుల కారణంగా ప్రజలకు శారీరకంగా గాయాలతో పాటు తీవ్ర భయాందోళనలు కూడా ఎదురవుతున్నాయి.
గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న సర్పంచ్‌లు, సంబంధిత అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రజాప్రతినిధులు సమస్యలపై స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
కోతుల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోతుల నియంత్రణకు అటవీ, పంచాయతీ అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టి, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కోతులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న కోతుల బెడదపై సర్పంచ్‌లు, అధికారులు ఇకనైనా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
