- District News
- Ranga Reddy
- సమతా మూర్తి స్పూర్తి కేంద్రం సామరస్యతకు చిరునామా. శ్రీ రామానుజుల సమానత్వ సందేశం నేటికీ సజీవం. ముచ్...
సమతా మూర్తి స్పూర్తి కేంద్రం సామరస్యతకు చిరునామా. శ్రీ రామానుజుల సమానత్వ సందేశం నేటికీ సజీవం. ముచ్చింతల్‌లో సమతా మూర్తి స్పూర్తి కేంద్ర సందర్శన లో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
గవర్నర్ కు శ్రీ రామానుజాచార్యుల వారి జీవిత చరిత్ర పుస్తకాలను బహుకరించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి
రంగారెడ్డి జిల్లా బ్యూరో, ఆగస్టు 6, ( లోకల్ గైడ్ ):
గురువారం తన సతీమణి శ్రీమతి జానకి శుక్లాతో కలిసి తొలిసారిగా సమతా మూర్తి స్పూర్తి కేంద్రాన్ని సందర్శించిన గవర్నర్, ఈ పుణ్యక్షేత్రం తనకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు.

బ్యాటరీ వాహనంలో స్పూర్తి కేంద్రాన్ని పరిశీలించిన గవర్నర్ దంపతులు, సమతామూర్తినీ దర్శించుకున్నారు.
వేద పండితులు గవర్నర్ దంపతులకు తీర్ధ ప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం అందజేశారు.
అనంతరం 216 అడుగుల ఎత్తైన శ్రీ రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని దర్శించుకున్నారు.
తదనంతరం సమతా మూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాల విశిష్టతను తెలుసుకున్నారు. కేంద్ర విశేషాలను అహోబిల జీయర్ స్వామి, కృష్ణ స్వామి గవర్నర్ దంపతులకు వివరించారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వైకుంఠనాథ భగవానుడిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
చివరగా స్వామీజీ కుటీరంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామిని గవర్నర్ దంపతులు కలిశారు. ఈ సందర్భంగా శ్రీ రామానుజాచార్యుల విశిష్ట సేవలు, విశిష్టాద్వైత తత్వం, సమతా మూర్తి స్పూర్తి కేంద్రం నిర్మాణ లక్ష్యం, ఇక్కడ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి జీయర్ స్వామి వివరించారు. అనంతరం గవర్నర్ దంపతులను శాలువాతో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి సత్కరించి సమతా మూర్తి ప్రతిమ, భగవత్ రామానుజ పుస్తకాన్ని , శ్రీ రామానుజచార్యుల వారి జీవిత చరిత్ర, చిత్ర కథ, సత్య సంకల్ప పుస్తకాలు సహా పలు పుస్తకాలను బహుకరించారు. ఆశీస్సులు అందజేశారు.
గవర్నర్ స్వామివారికి మెమెంటో అందించారు.
ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, సమతా మూర్తి విగ్రహం సమరసతకు, సామాజిక సమానత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశంలో అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో సమతా మూర్తి స్పూర్తి కేంద్రం ఒకటిగా నిలిచిందన్నారు.
వేదాలు బోధించిన విలువలను శ్రీ రామానుజాచార్యులు తమ జీవితంలో ఆచరించి చూపారని కొనియాడారు. వెయ్యేళ్ల క్రితమే జాతి, భాష, వర్ణ భేదాలకు అతీతంగా సమానత్వ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మహనీయుడని పేర్కొన్నారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిచెప్పి భక్తి ఉద్యమానికి నూతన దిశానిర్దేశం చేసిన మహోన్నత ఆధ్యాత్మిక విప్లవకారుడిగా శ్రీ రామానుజులను అభివర్ణించారు.
"దేవుడిని ఆరాధించడం, మోక్షాన్ని పొందడం ప్రతి మానవుడి హక్కు. ఆ హక్కును నిరాకరించే అధికారం ఎవరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానులే" అనే శ్రీ రామానుజాచార్యుల సందేశం యుగయుగాలకు మార్గదర్శకమని గవర్నర్ అన్నారు. వ్యక్తిగత శ్రేయస్సుకంటే సమాజ శ్రేయస్సే ముఖ్యమనే ఆయన బోధనలు నేటి సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు.
సందర్శన అనంతరం సందర్శకుల పుస్తకంలో గవర్నర్ తన అభిప్రాయాన్ని నమోదు చేశారు. "ముచ్చింతల్‌లోని సమతా మూర్తి స్పూర్తి కేంద్రాన్ని తొలిసారిగా సందర్శించాను. ఈ దివ్యక్షేత్రం నాకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. సమానత్వ సారాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం లభించింది. ఈ మహత్తర కేంద్రాన్ని నిర్మించిన స్వామీజీ, జీయర్ స్వామి, వారి బృందానికి హృదయపూర్వక అభినందనలు" అని రాసి సంతకం చేశారు.
