సిద్దిపేట ఆగస్ట్ 26(లోకల్ గైడ్):
ముదిరాజులను బీసీ ‘డి’ నుంచి బీసీ ‘ఏ’లోకి మారుస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ముదిరాజుల హక్కులు, మత్స్యకారుల సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం చేపపిల్లల పంపిణీతో పాటు టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలు, చేపలు పట్టే పరికరాలు, ఇతర సామాగ్రి అందించే కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులు, ముదిరాజుల సంక్షేమానికి కొత్త పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు.చేపపిల్లల పంపిణీ కార్యక్రమం కూడా సక్రమంగా అమలు కాకపోవడంతో మత్స్యకారుల కుటుంబాలు నష్టపోతున్నాయని ఆరోపించారు. ముదిరాజులకు బీసీ ‘ఏ’ రిజర్వేషన్ కల్పించడంతో పాటు మత్స్యకారుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని, పెండింగ్ హామీలను కార్యాచరణ ప్రణాళికతో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ముదిరాజుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని హరీశ్‌రావును నాయకులు కోరారు. హామీల అమలుకు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర యూత్ అధ్యక్షులు పడిగె ప్రశాంత్ ముదిరాజ్, నంగునూరు మండల అధ్యక్షులు గూళ్ల మధు, రాగుల సతీష్, పిట్ల భాస్కర్, పిట్ల సంజీవ్, కుమార్, చందు, బాలరాజు, రఘు, శ్రీనివాస్, వంశీ తదితరులు పాల్గొన్నారు.