- District News
- Khammam
- ఎస్.ఐ.ఆర్. ప్రక్రియలో తదుపరి దశకు సన్నద్ధం కావాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఎస్.ఐ.ఆర్. ప్రక్రియలో తదుపరి దశకు సన్నద్ధం కావాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా.. అక్టోబర్ 19న తుది జాబితా

కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై మీడియాతో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్, అనామలీస్, ఫారాలు తిరిగి సమర్పించని ఓటర్ల వివరాలు, తదుపరి చేపట్టాల్సిన ప్రక్రియ, క్లెయిమ్స్, అభ్యంతరాలు, అవసరమైన ధృవపత్రాల సమర్పణ, తదితర అంశాలను కలెక్టర్ వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ షెడ్యూల్‌ను రెండు పర్యాయాలు పొడిగించిందని తెలిపారు. ప్రస్తుతం తొలి దశ ప్రక్రియ పూర్తయిందని, తదుపరి దశకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని చెప్పారు. ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తామని, ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు.
10 లక్షల 85 వేల 927 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్
ఖమ్మం జిల్లాలో మొత్తం 10,85,927 ఎన్యూమరేషన్ ఫారాలు (87.31 శాతం) మేర డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. సేకరించిన ఫారాల్లో 43,131 మంది మ్యాపింగ్ చేయబడలేదని, వీరికి నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. నోటీసులు అందుకున్న వారు ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల ధృవపత్రాల్లో నిబంధనలకు అనుగుణంగా తగిన ధృవపత్రాన్ని సమర్పించాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన ధృవపత్రాలు అందుబాటులో లేని వారు దరఖాస్తు చేసుకోవాలని, వారికి అవసరమైన ధృవ పత్రాలను వీలైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎస్.ఐ.ఆర్. డేటాలో 1,32,736 అనామలీస్ గుర్తింపు
జిల్లాలో 1,32,736 అనామలీస్ గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇది మొత్తం ఫారాల్లో 10.67 శాతం అని చెప్పారు. పేర్ల స్పెల్లింగ్‌లో తేడాలు, తల్లిదండ్రులు–పిల్లల మధ్య వయస్సు వ్యత్యాసం 15 సంవత్సరాల కంటే తక్కువగా ఉండటం తదితర కారణాలతో అనామలీస్ గుర్తించినట్లు తెలిపారు. వీటిని కేవలం డేటాలోని లోపాలుగా పరిగణించకుండా, క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించి వాస్తవాలను నిర్ధారించిన అనంతరం అవసరమైన సవరణలు చేపడతామని
తెలిపారు.
1,57,854 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలేదు
జిల్లాలో 1,57,854 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి సమర్పించలేదని కలెక్టర్ తెలిపారు. వీరిపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించామని చెప్పారు. క్షేత్రస్థాయి విచారణలో 33,380 మంది మరణించిన ఓటర్లు, 11,004 మంది డబుల్ ఓటర్లు, సుమారు 1,01,000 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.
మరో సుమారు 11 వేల మంది వివిధ కారణాల వల్ల ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించలేకపోయారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, ముసాయిదా ఓటరు జాబితా రూపకల్పన లో తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.
ఫారం సమర్పించని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం
ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని అర్హులైన ఓటర్లకు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు మరో అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇతర ప్రాంతంలో తనకు ఓటు హక్కు లేదని ప్రకటిస్తూ అవసరమైన డిక్లరేషన్‌తో పాటు సంబంధిత వివరాలు, ధృవపత్రాలను సమర్పించవచ్చని చెప్పారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
అదేవిధంగా కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే అర్హులైన పౌరులు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పుట్టిన తేదీకి అనుగుణంగా ఎన్నికల సంఘం సూచించిన ధృవపత్రాలను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.
నోటీసులు అందుకున్న వారు ఆధారాలను సమర్పించాలి.
ఎన్యూమరేషన్ ఫారంలో ఓటరు గత ఎస్‌ఐఆర్ ఓటరు జాబితా వివరాలు అందుబాటులో లేకపోవడం లేదా డేటాబేస్‌లో ఉన్న వివరాలతో సరిపోలక పోవడం వంటి సందర్భాల్లో సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) నోటీసులు జారీ చేస్తారని కలెక్టర్ తెలిపారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు తమ పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశాన్ని నిర్ధారించే ఆధారాలను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఈఆర్ఓ సంబంధిత ఆధారాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
జనన తేదీ ఆధారంగా ధృవపత్రాల సమర్పణ
భారతదేశంలో *1987జులై 1కు ముందు జన్మించిన వారు తమ స్వీయ గుర్తింపు లేదా జనన పత్రాలు నిర్ధారించే ధృవ పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుందని, *1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తల్లిదండ్రులలో ఎవరిదైనా ఒకరి ధృవ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని, 2004 డిసెంబర్ 2 తర్వాత జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తల్లిదండ్రులిద్దరి పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల ధృవ పత్రాలలో నిబంధనలకు అనుగుణంగా ఏదైనా ఒకదాన్ని సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు.
క్లెయిమ్స్, అభ్యంతరాలపై విచారణ అనంతరం నిర్ణయం
ఎన్యూమరేషన్ వివరాలపై వచ్చే క్లెయిమ్స్, అభ్యంతరాలను ఈఆర్ఓలు నోటీసులు జారీ చేసి, సంబంధిత ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు.
ఈఆర్ఓలు తీసుకున్న నిర్ణయంపై నిబంధనల ప్రకారం అక్టోబర్ 15 వరకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజలు తమకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా సహకరించాలి.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో ఎలాంటి అపోహలు లేకుండా వాస్తవ సమాచారాన్ని విస్తృతంగా చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కోరారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, మరణించిన, శాశ్వతంగా తరలివెళ్లిన, డబుల్ నమోదైన ఓటర్ల వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించేలా ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం పాత్రికేయులు ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్, అనామలీస్, ఓటర్ల వివరాల పరిశీలన, ధృవపత్రాల సమర్పణ, క్లెయిమ్స్, అభ్యంతరాలు, తదితర అంశాలపై అడిగిన పలు ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సమాధానాలు ఇచ్చారు.
ఈ మీడియా సమావేశంలో కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ పర్యవేక్షకులు రాజు, డిటి అన్సారీ, సంబంధిత అధికారులు, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
