- District News
- కార్పొరేట్ శక్తుల నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడాలి
కార్పొరేట్ శక్తుల నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడాలి
ఆగస్టు 10న ఎస్‌కేఎం జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: పీవైఎల్ రాష్ట్ర నాయకుడు భూక్య శివ నాయక్
ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 7: వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేలా కేంద్ర ప్రభుత్వం చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని పీవైఎల్ తెలంగాణ రాష్ట్ర నాయకుడు భూక్య శివ నాయక్ డిమాండ్ చేశారు. రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం 84వ వార్షికోత్సవం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో ఆగస్టు 10న నిర్వహించనున్న జైలు భరో కార్యక్రమానికి రైతులు, కార్మికులు, కర్షకులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ రంగం నుంచి వైదొలగేలా ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ, రుణమాఫీ చట్టం, పంటల బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ చట్టం–2025, విత్తన బిల్లుతో పాటు రైతులకు నష్టం కలిగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. ఆగస్టు 10న జరిగే జైలు భరో కార్యక్రమానికి పీవైఎల్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మంగన్న, మీసం శ్రీను, పీవోడబ్ల్యూ రాష్ట్ర నాయకులు భాగ్యక్క, రాధా తదితరులు పాల్గొన్నారు.
