- District News
- వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ
వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్ , ఎం ఏ ఓ ఎస్ తో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు పరిస్థితి, పప్పుధాన్యాల విత్తనాల పంపిణీ, డిజిటల్ క్రాప్ సర్వే మరియు వనమహోత్సవం కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించేందుకు చర్యలు:
జిల్లాలో ప్రస్తుతం సాగు చేసిన వరి విస్తీర్ణాన్ని సమీక్షించి, ఇకపై వరి సాగు విస్తీర్ణం పెరగకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వరి సాగుకు ఉద్దేశించిన మిగిలిన భూములను ముందస్తు రబీ పంటలు, ముఖ్యంగా కుసుమ, పప్పు దినుసులు మరియు వేరుశెనగ వంటి పంటల సాగు వైపు మళ్లించేలా రైతులకు సూచనలు, సాంకేతిక మార్గదర్శకాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
మిషన్ ఆత్మనిర్భర్ పప్పుధాన్యాల విత్తనాల పంపిణీ:
ఆత్మనిర్భర్ భారత్ మిషన్ 2026 కింద జిల్లాకు అందుబాటులో ఉంచిన కంది, మినుము మరియు పెసర విత్తనాలను ముందస్తు రబీ సాగుకు ఆగస్టు 24 మరియు 25 తేదీలలో యుద్ధ ప్రాతిపదికన రైతులకు పంపిణీ చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
డిజిటల్ క్రాప్ సర్వే:
జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ప్రైవేట్ సర్వేయర్లను ఆగస్టు 24, 2026 నాటికి గుర్తించి నియమించే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
డిజిటల్ క్రాప్ సర్వేను నిర్ణీత గడువులో, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వనమహోత్సవం కార్యక్రమం:
వనమహోత్సవం కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ఎంపీడీఓ లు మరియు డి ఆర్ డి ఓ లతో సమన్వయం చేసుకుని అవసరమైన మొక్కలను సమయానికి సమకూర్చి, వాటిని నిర్ణీత ప్రదేశాల్లో నాటడం ద్వారా లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నకిలీ డి ఏ పి , ఎరువులు మరియు విత్తనాల నియంత్రణ:
మండల స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాల ద్వారా నకిలీ డి ఎ పి నకిలీ ఎరువులు మరియు నకిలీ విత్తనాల అక్రమ విక్రయాలు, నిల్వలపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఎం ఏ ఓ లను ఆదేశించారు. ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, అనుమానాస్పద నిల్వలు లేదా అక్రమ విక్రయాలు గుర్తించిన వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తనిఖీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీస్, రెవెన్యూ మరియు ఎంపీడీఓ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, నకిలీ డి ఏ పి , ఎరువులు మరియు విత్తనాల సరఫరా, విక్రయాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్యాలను నిర్ణీత గడువులో సాధించేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో స్పష్టం చేశారు.
