- District News
- లబ్ధిదారు ఒకరు.. లబ్ధి పొందింది మరొకరు! - కల్యాణలక్ష్మి చెక్కు చేతులు మారిందెలా..?
లబ్ధిదారు ఒకరు.. లబ్ధి పొందింది మరొకరు! - కల్యాణలక్ష్మి చెక్కు చేతులు మారిందెలా..?
ఒకే పేర్లతో రెండు కుటుంబాలు.. అధికారుల వెరిఫికేషన్‌పై అనుమానాలు - అసలు లబ్ధిదారుకు అందని ప్రభుత్వ సాయం
లోకల్ గైడ్/తాండూర్:
రాంసింగ్ తండాకు చెందిన సునీత రాథోడ్‌కు 2025లో వివాహం జరిగింది. ఆమెకు కల్యాణలక్ష్మి పథకం కింద సాయం మంజూరైనప్పటికీ, ఆ సాయం అసలు లబ్ధిదారుకు కాకుండా మరో వ్యక్తికి చేరినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పాషాపూర్ గ్రామంలో కూడా అదే పేరుతో ఓ మహిళ ఉండటంతో ఈ గందరగోళం ఏర్పడినట్లు తెలుస్తోంది.
బాధితుల వివరాల ప్రకారం.. అసలైన లబ్ధిదారు రాథోడ్ శాంతాబాయి, భర్త గేమ్యా నాయక్. వీరి నివాసం రాంసింగ్ తండా. అయితే ఇదే పేరుతో ఉన్న రాథోడ్ శాంతాబాయి, భర్త శంకర్, పాషాపూర్ గ్రామానికి చెందిన మరో మహిళ కల్యాణలక్ష్మి చెక్కును ఉపసంహరించుకున్నట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.కాగా
కల్యాణలక్ష్మి దరఖాస్తు ప్రక్రియలో భాగంగా రెవెన్యూ అధికారులు, ఆర్‌ఐ, జూనియర్ అసిస్టెంట్ తదితరులు క్షేత్రస్థాయిలో పంచనామా, వెరిఫికేషన్ నిర్వహించినట్లు బాధిత కుటుంబం చెబుతోంది. ఒకే పేర్లతో ఇద్దరు వ్యక్తులు ఉన్న సందర్భంలో ఆధార్, భర్త పేరు, గ్రామం, కుటుంబ వివరాలు, చిరునామా తదితర అంశాలను పరిశీలించాల్సి ఉన్నప్పటికీ, అసలు లబ్ధిదారుకు బదులుగా మరో వ్యక్తి చెక్కును ఎలా పొందారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
అసలు లబ్ధిదారు రాంసింగ్ తండాకు చెందినవారు కాగా, చెక్కును ఉపసంహరించుకున్న వ్యక్తి పాషాపూర్ గ్రామానికి చెందినవారని బాధితులు పేర్కొంటున్నారు. దీంతో అధికారులు నిర్వహించిన వెరిఫికేషన్ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో
తమకు రావాల్సిన ప్రభుత్వ సాయం మరో వ్యక్తి చేతికి ఎలా వెళ్లిందో అధికారులు స్పష్టం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, కల్యాణలక్ష్మి సాయం అందేలా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
