సిద్దిపేట, ఆగస్టు 12(లోకల్ గైడ్):
ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తహసీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలకు సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించి, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.బుధవారం రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 265లో ఉన్న 6 ఎకరాలు, రాయపోల్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 729లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ స్థలాలను జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్‌తో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ భూముల రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో భూముల పరిస్థితిని నిర్ధారించాలని తెలిపారు. ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ఎంత మేర ఆక్రమణకు గురైందనే పూర్తి సమాచారాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ భూములకు పకడ్బందీగా సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేయాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా వ్యవహరించాలని తహసీల్దార్లను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలకు, అలాగే తహసీల్దార్, పోలీస్ తదితర ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి త్వరలో నిర్మాణాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు.కలెక్టర్ వెంట ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ కృష్ణమోహన్, సర్వే, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.