- District News
- Ranga Reddy
- నీట్ పీజీ -2026 పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
నీట్ పీజీ -2026 పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, ట్రాఫిక్, సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి-జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి.
రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ): ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న నీట్ పీజీ 2026 పరీక్షను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికా
రులను ఆదేశించారు. నీట్ పీజీ 2026
పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డా. కిరణ్మయి కొప్పిశెట్టి తో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఏసీపీలు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ( ఎన్ బిఈ ఎం ఎస్ ) ఆధ్వర్యంలో ఆగస్టు 30న ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సి బిటి ) నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల రిపోర్టింగ్ ఉదయం 7:00 గంటల నుంచి ప్రారంభమవుతుందని, పరీక్ష సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రతి పరీక్షా కేంద్రానికి నోడల్ అధికారి, స్క్వాడ్‌ల నియామకం
ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక తహసీల్దార్‌ను నోడల్ అధికారిగా, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిగా నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే డిప్యూటీ తహసీల్దార్‌ను ఫ్లయింగ్ స్క్వాడ్‌గా, నాయబ్ తహసీల్దార్‌ను సిట్టింగ్ స్క్వాడ్‌గా, ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక పోలీసు సిబ్బందిని కేటాయించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వారీగా అధికారులు, పోలీసు సిబ్బంది నియామకాలు, విధులు స్పష్టంగా కేటాయించి, పరీక్ష ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
భద్రత, ఫ్రిస్కింగ్‌పై ప్రత్యేక దృష్టి
పరీక్షా కేంద్రాల వద్ద తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, మహిళా అభ్యర్థుల తనిఖీల కోసం ప్రత్యేకంగా మహిళా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. హ్యాండ్‌హెల్డ్ మెటల్ డిటెక్టర్లతో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, అభ్యర్థుల ఒరిజినల్ ఫోటో గుర్తింపు పత్రాలు, ఆధార్/బయోమెట్రిక్ ధృవీకరణ తదితర అంశాలను ఎన్ బి ఈ ఎం ఎస్ మార్గదర్శకాల ప్రకారం పరిశీలించాలని తెలిపారు.
మొబైల్ ఫోన్లు, స్పై కెమెరాలు, ఇయర్‌పీసులు, ఇతర కమ్యూనికేషన్ పరికరాలు, చిట్స్, నోట్స్ తదితర నిషేధిత వస్తువులు పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలి
పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యామ్నాయ విద్యుత్ సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. పరీక్షకు సంబంధించిన ఎన్‌క్రిప్టెడ్ ప్రశ్నపత్రాల డౌన్‌లోడ్, అభ్యర్థుల సమాధానాల డేటా అప్‌లోడ్ కోసం అవసరమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.
సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలి
ప్రతి పరీక్షా కేంద్రానికి సమీపంలోని సైబర్ పోలీస్ స్టేషన్‌తో సమన్వయం చేసుకొని సైబర్ కమాండ్స్‌ను అప్రమత్తంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. పరీక్షకు సంబంధించిన తప్పుడు సమాచారం, ప్రశ్నపత్రం లీక్, ఇంపర్సనేషన్, రూమర్లు వంటి అంశాలపై సోషల్ మీడియాను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు చర్యలు
పరీక్షా కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, అభ్యర్థులు, వారి వెంట వచ్చే వ్యక్తుల రద్దీని నియంత్రించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సున్నితమైన/అధిక ప్రమాద కేంద్రాల వద్ద మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
పరీక్షా కేంద్రాలను సందర్శించే ఎన్ బి ఈ ఎం ఎస్ / టి సి ఎస్ అధికారులు, స్వతంత్ర పరిశీలకులు, సర్వైలెన్స్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతికూల సమాచారం వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి
పరీక్షా కేంద్రాలకు సంబంధించిన ఏదైనా ప్రతికూల, సున్నితమైన లేదా అవాంఛనీయ సమాచారం అందిన వెంటనే జిల్లా, రాష్ట్ర స్థాయి నోడల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.
నీట్ పీజీ 2026 పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా, పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీస్, వైద్య, విద్యుత్, సైబర్ తదితర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఏసీపీలు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
