- District News
- Khammam
- మినీ టీ-వర్క్స్ కేంద్రం ఏర్పాటుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
మినీ టీ-వర్క్స్ కేంద్రం ఏర్పాటుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో తయారీ, ఆవిష్కరణలపై ఆసక్తి పెంపొందించాలి. మధిర పరిసరాల్లో 20 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి విద్యార్థులకు శిక్షణ అందించాలి
ఖమ్మం, ఆగస్టు -12: లోకల్ గైడ్:
కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్, టీ-వర్క్స్ సీఈఓ తనికెళ్ల జోగిందర్ లతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మధిరలో మినీ టీ-వర్క్స్ కేంద్రం ఏర్పాటుపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* టీ-హబ్ స్టార్టప్‌లకు ఇంక్యుబేటర్‌గా పనిచేస్తూ ఉత్పత్తి రూపకల్పన, ఆర్థిక సహాయం, మార్కెటింగ్ వంటి అంశాల్లో సహకారం అందిస్తుందని, అదే విధంగా *టీ-వర్క్స్* ఒక ఆలోచనను వాస్తవ ఉత్పత్తిగా మార్చేందుకు అవసరమైన తయారీ, సాంకేతిక సహకారం అందించే సంస్థగా పనిచేస్తుందని అన్నారు.
విద్యార్థుల్లో తయారీ రంగంపై ఆసక్తిని పెంపొందించే కార్యక్రమాలను పక్కా ప్రణాళికతో అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు కేవలం తరగతి గదుల్లో శిక్షణ ఇవ్వకుండా, తయారీ యూనిట్లు, వర్క్‌షాప్‌లను సందర్శించేలా ఫీల్డ్ విజిట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరమైన పోర్టబుల్ టూల్స్, యంత్రాలను పాఠశాలలకు తీసుకెళ్లి వాటి వినియోగం, పనితీరును విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించాలని సూచించారు.
మినీ టీ-వర్క్స్ కేంద్రం ఏర్పాటుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ను నోడల్ అధికారిగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మధిరలో టీ-వర్క్స్ కోసం గుర్తించిన స్థలానికి సమీపంలోని 20 ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే గుర్తించాలని సూచించారు.
8, 9వ తరగతి విద్యార్థులకు టీ-వర్క్స్ ఆధ్వర్యంలో శిక్షణ అందించేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. రెసిడెన్షియల్ హాస్టళ్లలో విద్యార్థుల సాధారణ వసతి, విద్యా కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. హాస్టళ్లలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో భాగంగా స్వయంగా ప్రాజెక్టులను రూపొందించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు. ఇప్పటికే తయారైన ప్రాజెక్టులను కొనుగోలు చేసి సమర్పించే విధానానికి బదులుగా, విద్యార్థులు స్వయంగా ఆలోచించి ప్రాజెక్టులను రూపొందించేలా ప్రాక్టికల్ శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
విద్యార్థులకు ప్రాజెక్టు తయారీపై అవగాహన కల్పించేందుకు టీ-వర్క్స్ ఆధ్వర్యంలో అవసరమైన వర్క్‌షాప్‌లను నిర్వహించాలని సూచించారు. ఆలోచనను గుర్తించడం నుంచి ప్రాజెక్టు రూపకల్పన, తయారీ, పరీక్ష వరకు విద్యార్థులు స్వయంగా పాల్గొనేలా శిక్షణ అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
మినీ టీ-వర్క్స్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలం, పాఠశాలల ఎంపిక, విద్యార్థుల భాగస్వామ్యం, సీఎస్ఆర్, పరిశ్రమల సహకారం, తదితర అంశాలపై సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కేంద్రం ఏర్పాటు అనంతరం కూడా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేందుకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అన్నారు.
టీ-వర్క్స్ సీఈఓ తనికెళ్ల జోగిందర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీ-వర్క్స్ కార్యకలాపాలు, లక్ష్యాలు, స్టార్టప్‌లు, విద్యార్థులకు అందిస్తున్న శిక్షణ, తదితర అంశాలను వివరించారు. దేశవ్యాప్తంగా వివిధ స్టార్టప్‌లు టీ-వర్క్స్ సేవలను వినియోగించుకుంటున్నాయని తెలిపారు. ఇటీవల స్కైరూట్ సంస్థ చేపట్టిన రాకెట్ ప్రయోగంలో ఉపగ్రహానికి సంబంధించిన కొన్ని భాగాల తయారీలో టీ-వర్క్స్ సహకారం అందించిందని వివరించారు.
టీ-వర్క్స్ తరహా సంస్థలను ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్నామని, నాగాలాండ్, కేరళ, తదితర ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలకు సహకారం అందించినట్లు తెలిపారు. *మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్* అనే లక్ష్యంతో టీ-వర్క్స్ పనిచేస్తోందని చెప్పారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత, తయారీ నైపుణ్యాలను పెంపొందించేందుకు *డ్రీమ్, స్టార్ట్, రైజ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్* కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు టీ-వర్క్స్ సీఈఓ తెలిపారు. ఇందులో భాగంగా *మైండ్‌సెట్ ఆఫ్ మేకర్* కార్యక్రమాలను నిర్వహిస్తూ పాఠశాల విద్యార్థులతో నిరంతరం పరస్పర చర్చలు చేపట్టి, వారిలో తయారీ రంగంపై ఆసక్తిని పెంపొందిస్తున్నా మని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తొలుత మంథనిలో ప్రారంభించినట్లు వివరించారు.
మధిరలో మినీ టీ-వర్క్స్ కేంద్రం ఏర్పాటుకు సుమారు 1,500 నుంచి 2,000 చదరపు అడుగుల స్థలం అవసరమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు జిల్లా విద్యాశాఖ సహకారం, కేంద్రానికి సమీపంలోని కనీసం 20 ప్రభుత్వ పాఠశాలలకు చేరువయ్యే అవకాశం అవసరమని చెప్పారు. జిల్లా యంత్రాంగం సహకారంతో పాటు సీఎస్ఆర్ సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో కేంద్రాన్ని నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
ఈ సమావేశంలో టీ-వర్క్స్ మేనేజర్ డి.రాకేష్, టీ-వర్క్స్ ప్రతినిధులు జె. రేవంత్ నాయక్, జి. వంశీ, జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవి బాబు, జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మాధవి, జిల్లా యువజన అధికారి సునీల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి/డీడీ సోషల్ వెల్ఫేర్ జి. జ్యోతి, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ ఎం. ఫిరంగి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్, సంబంధిత శాఖల అధికారులు, ఏటీసీ ప్రిన్సిపాల్ ఖమ్మం, ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్, మధిర మున్సిపల్ కమీషనర్, ఈడీఎం, తదితరులు పాల్గొన్నారు.
