- District News
- భూసేకరణలో రైతులతో సమన్వయం చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్
భూసేకరణలో రైతులతో సమన్వయం చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్
వారం రోజుల్లోగా భూ సర్వే పూర్తి చేయాలి
లక్ష్మీదేవిపల్లి : లోకల్ గైడ్ న్యూస్ :
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, భూ సర్వే పనులను వేగవంతం చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రపురం, కారుకొండ రెవెన్యూ గ్రామాల పరిధిలో జరుగుతున్న భూ సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్.. భూముల వివరాలు, సర్వే పురోగతి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ప్రతిపాదిత అలైన్‌మెంట్ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హేమచంద్రపురం, కారుకొండ గ్రామాల పరిధిలో సుమారు 191.25 ఎకరాల భూమిని సర్వే చేయాల్సి ఉండగా, సుమారు 7.50 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ఇప్పటివరకు సుమారు 6 ఎకరాల మేర భూ సర్వే పూర్తయిందని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. మిగిలిన భూములకు సంబంధించిన సర్వేను వేగవంతంగా పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రతిపాదిత కాలువ అలైన్‌మెంట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, సర్వే ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ సర్వే పనులను ప్రతిరోజూ ఉదయం 8 గంటలకే ప్రారంభించాలని, సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన సిబ్బందిని సమన్వయం చేసుకొని పనులను నిరంతరం కొనసాగించాలని, వారం రోజుల్లోగా మొత్తం భూ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సర్వే పురోగతిని ప్రతిరోజూ సమీక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. భూముల హద్దులు, విస్తీర్ణం, ఇతర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని తెలిపారు. రైతులకు సర్వేకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే వాటిని క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం రైతులతో కలెక్టర్ మాట్లాడి భూ సర్వే ప్రక్రియకు సహకరించాలని కోరారు. అధికారులు నిర్వహించే సర్వే సమయంలో అవసరమైన సమాచారం అందిస్తూ ప్రాజెక్టు పనులు సజావుగా ముందుకు సాగేలా సహకరించాలని సూచించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగునీటి వసతుల విస్తరణకు భూసేకరణ, భూ సర్వే కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో కొత్తగూడెం ఆర్డీవో మధు, లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ శిరీష, సర్వే అధికారులు, ఇరిగేషన్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
