- District News
- ప్రజా సమస్యల పరిష్కార మే ప్రజా పాలన లక్ష్యం
ప్రజా సమస్యల పరిష్కార మే ప్రజా పాలన లక్ష్యం
మంత్రి సీతక్క

ప్రజా సమస్యల పరిష్కా రం, గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం లో రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్నబి య్యం పంపిణీ, మహిళా సంక్షేమం తదితర కార్యక్ర మాలు అమలు చేస్తున్నా మని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
గురువారం నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజక వర్గంలోని 25 గ్రామాలలో 178 కోట్ల 84 లక్షల నిధులతో బీటీ రోడ్లు, పలు అభివృధి పనులకు మక్తల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో జిల్లా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తో కలిసి సీతక్క శంకు స్థాపన చేశారు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం జిల్లా మంత్రి వాకిటి శ్రీహరి తన రాజకీయ ప్రస్థానం సర్పంచి గా ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతక్క శ్రీహరి లలిత దంపతులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..
శ్రీహరి 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం అన్నారు. మక్తల్ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఎదిగిన వాకిటి శ్రీహరి 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర ప్రజాసేవకు నిదర్శనమని ఆమె కొనియాడారు. సర్పంచ్‌గా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర మంత్రిగా ఎదిగే స్థాయికి చేరుకోవడం వెనుక 25 ఏళ్ల కఠోర శ్రమ, ప్రజల పట్ల నిబద్ధత ఉన్నాయని పేర్కొన్నారు.
శ్రీహరి సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రోజుతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి రోజుకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీలకు అధికార వికేంద్రీకరణ, స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేశారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా శ్రీహరి గ్రామస్థాయి నుంచి ప్రజాసేవలో అడుగులు వేయడం విశేషమని అన్నారు.
మక్తల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు ప్రత్యేకంగా అభివృద్ధి ప్రగతి నివేదికను రూపొందించాలని సూచించారు. రెండున్నర సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో చేపట్టిన రోడ్లు, భవనాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వంతెనలు, ఇతర మౌలిక వసతుల వివరాలను అందులో పొందుపరచాలని తెలిపారు.
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.
పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి
పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రూపులు, వర్గాలకు అతీతంగా ఐక్యంగా పనిచేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మంచి నాయకత్వం అంటే ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగడమేనని, పార్టీ బలోపేతానికి సమష్టి కృషి అవసరమని అన్నారు.
నాయకుల మధ్య అనవసర విభేదాలు అభివృద్ధిపై ప్రభావం చూపుతాయని, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల సాధనపైనే దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ బలంగా ఉంటేనే నాయకులు, కార్యకర్తలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
నిజాలను ప్రజలకు వివరించాలి
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని ఆమె పార్టీ నాయకులకు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ఆరోపణలకు అదే విధంగా స్పందించడం కాకుండా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు.
ప్రజల కోసం పనిచేసే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రాబోయే కాలంలో మక్తల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ వాకిటి శ్రీహరి కుటుంబ సభ్యులను, పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందిస్తూ, ఆయన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.
మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,500–1,600 కోట్ల పనులు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య శాఖ క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ...
25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజల ఆశీర్వాదమే తన బలం అని అన్నారు.
మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి, వివిధ అభివృద్ధి పనులు చేపడుతోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నియోజకవర్గంలో ప్రస్తుతం సుమారు రూ.1,500 నుంచి రూ.1,600 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
తన రాజకీయ ప్రస్థానం 2001 ఆగస్టు 20న మక్తల్ సర్పంచ్‌గా ప్రారంభమైందని, 25 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ప్రజలు, కార్యకర్తలు అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరువలేనని ఆయన పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమానికి పెద్దపీట
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్ నియోజకవర్గంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి పథకం, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలవుతున్నాయని తెలిపారు.
నియోజకవర్గంలో 33,708 మంది రైతులకు రూ.363 కోట్ల రుణమాఫీ, 92,949 మంది రైతులకు రూ.153 కోట్ల రైతు భరోసా అందినట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత
గతంలో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో హామీలు ఇచ్చి అమలు చేయలేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా చేపడుతోందన్నారు.
మక్తల్ నియోజకవర్గంలో సుమారు 5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 3,500కు పైగా ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు.
రోడ్లు, వంతెనలకు భారీగా నిధులు
మక్తల్–నారాయణపేట రహదారి అభివృద్ధికి రూ.237 కోట్ల నిధులు మంజూరు చేసి నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులు, సీసీ రోడ్లు, వంతెనల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరయ్యాయని చెప్పారు.
మక్తల్ నియోజకవర్గంలో కొత్త క్రీడా మైదానానికి రూ.25 కోట్లు, వివిధ గ్రామాల్లో వంతెనలు, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు తదితర పనులు చేపడుతున్నట్లు వివరించారు.
మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంతో సాగునీరు
మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మక్తల్, నారాయణపేట ప్రాంతాలకు సాగునీటి వసతి మెరుగుపడుతుందని తెలిపారు. ఈ పథకంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు.
భూసేకరణలో రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆత్మకూర్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
ఆత్మకూర్ ప్రాంతంలో రూ.123 కోట్లతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.26 కోట్లు, పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు, క్రీడా మైదానాలకు రూ.4.5 కోట్లు తదితర నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
అమరచింత, ఉట్కూర్, నర్వ, కృష్ణ, మాగనూరు మండలాల్లో కూడా రోడ్లు, వంతెనలు, పాఠశాలలు, క్రీడా మైదానాలు, ఆసుపత్రులు, పంచాయతీ భవనాలు తదితర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
“ప్రజలే నా బలం.. మక్తల్ అభివృద్ధే నా లక్ష్యం
రానున్న రెండున్నరేళ్లలో మరింత వేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలబెడతాం” అని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
ఫోటో రైట్ అప్:సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క,7.స్వాగతం పలికిన మంత్రి శ్రీహరి
-------------------------------------
