- District News
- ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసుల జారీకి ఆదేశం ముందస్తు అనుమతి తప్పనిసరి

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే 'ప్రజావాణి' కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, వినతులపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చే ప్రజావాణికి అధికారులు నిర్ణీత సమయానికి హాజరై ప్రజల సమస్యలను స్వయంగా స్వీకరించాలని స్పష్టం చేశారు. ఏవైనా అత్యవసర కారణాల వల్ల గైర్హాజరు కావాల్సి వస్తే, ముందస్తు అనుమతి తీసుకోవడంతో పాటు తమ శాఖకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.
ఈ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 103 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. స్వీకరించిన ప్రతి అర్జీని సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఫిర్యాదుల పరిష్కార పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
అలాగే, ప్రతి సోమవారం మండల స్థాయిలో జరిగే ప్రజావాణి ఫిర్యాదులపై మండల స్పెషల్ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని, స్వీకరించిన ఫిర్యాదుల జాబితాను క్రమం తప్పకుండా సమర్పించాలని ఆదేశించారు. దీంతో పాటు అధికారులతో సహా సిబ్బంది అందరూ "మీ ప్రమాణం" యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, జడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌తో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
