- District News
- Khammam
- విషజ్వరాల విజృంభణ.. పల్లెలు విలవిల
విషజ్వరాల విజృంభణ.. పల్లెలు విలవిల
ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి..
కారేపల్లి, అక్టోబర్ 5 (లోకల్ గైడ్ న్యూస్):
డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విజృంభించడంతో పల్లెల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. విషజ్వరాల నివారణకు ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత వైద్య సేవలు, మందులు అందించాలని డిమాండ్ చేశారు. సోమవారం షేక్ బందే అలీ అధ్యక్షతన కారేపల్లిలో జరిగిన సీపీఎం గ్రామ శాఖ సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగకపోవడంతో దోమల బెడద పెరిగి డెంగ్యూ, మలేరియా తదితర జ్వరాలు అధికమవుతున్నాయని తెలిపారు. అనేక గ్రామాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, ముగ్గురు జ్వరాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యం సకాలంలో అందుబాటులో లేక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు మొబైల్ వైద్య వాహనాల ద్వారా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పల్లె దవాఖానాల్లో వైద్యులు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో మురుగు కాలువలను శుభ్రం చేయడం, నీటి నిల్వలను తొలగించడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల నివారణ మందు పిచికారీ చేయడంతో పాటు నిరంతర పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు తలారి దేవప్రకాష్, శాఖ కార్యదర్శి అన్నవరపు కృష్ణ, కొండబోయిన ఉమావతి, ముండ్ల ఏకాంబరం, ముక్క సీతారాములు, ఎస్.కె. మహమ్మద్ పాషా, పాసిని నాగేశ్వరరావు, ఇల్లంగి పిచ్చయ్య, కరికపల్లి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.
