- District News
- ఆలయ భూముల రక్షణకై నిరాహార దీక్ష
ఆలయ భూముల రక్షణకై నిరాహార దీక్ష
సమస్య పరిష్కరించే వరకు దీక్ష విరమించేది లేదు
–
చర్ల : లోకల్ గైడ్ :
చర్ల మండలంలోని సాయిబాబా గుడి పక్కన సర్వే నంబర్ 117లో ఉన్న శ్రీశ్రీశ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ మహా రుద్ర సేన వ్యవస్థాపకులు కొండా చరణ్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా కొందరు వ్యక్తులు ఆలయ భూమిని ఆక్రమించి అక్రమంగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా రెవెన్యూ అధికారులకు, ప్రస్తుత తహసీల్దార్‌కు అనేకసార్లు వినతిపత్రాలు అందజేసినా ఇప్పటివరకు ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. 50 సార్లకు పైగా వినతిపత్రాలు ఇచ్చినా నోటీసులు జారీ చేస్తామని, నివేదిక తయారు చేస్తామని చెప్పడం తప్ప సమస్యను పరిష్కరించలేదని ఆరోపించారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆక్రమణదారులు అక్కడే నివాసం కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆలయ భూములకు రక్షణ కల్పించడంలో రెవెన్యూ వ్యవస్థ విఫలమైందని మండిపడ్డారు. ఈ వైఖరి హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ భూముల పరిరక్షణ కోసం చేపట్టిన నిరాహార దీక్షకు మండల ప్రజలు, హిందూ సమాజం, వివిధ దేవాలయాల కమిటీలు మద్దతు ఇవ్వాలని కొండా చరణ్ కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆలయ భూములను రక్షించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్ష శిబిరానికి శ్రీశ్రీశ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అలాగే చర్ల మండల యువజన నాయకులు, ప్రముఖ న్యాయవాది పరిటాల సంతోష్, లోక్ రక్షక్ పార్టీ నాయకులు కొండా ప్రమోద్, మహిళా రక్షక్ సంఘ్ జిల్లా అధ్యక్షురాలు చిట్టిమల్ల సుజాత, మైనారిటీ రక్షక్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. భాష తదితరులు మద్దతు తెలిపారు.
