- District News
- గోదావరి పుష్కరాల నాటికి ఘాట్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
గోదావరి పుష్కరాల నాటికి ఘాట్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్
భద్రాచలం, లోకల్ గైడ్ న్యూస్ (భద్రాద్రి జిల్లా బ్యూరో) :
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌లో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాల నాటికి ఉత్తర ద్వార దర్శనం పనులు పూర్తి చేయాలని, వచ్చే ఏడాది శ్రీరామనవమి నాటికి మిగిలిన దేవస్థానం అభివృద్ధి పనులన్నీ పూర్తిచేయాలని సూచించారు. బుధవారం ఆయన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న పునరుద్ధరణ, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిత్రకూట మండపం, గోశాల, అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్, శివాలయానికి వెళ్లే మార్గం, ఉత్తర ద్వార దర్శనం, మాడవీధులు, రామాలయం పరిసరాల్లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మంత్రి సూచనలు, దేవస్థానం ఆగమ శాస్త్ర పండితుల సూచనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని రాహుల్ అన్నారు. ఒప్పందంలో పేర్కొన్న గడువు కంటే ముందుగానే పనులు పూర్తయ్యేలా కాంట్రాక్టర్లు, వాస్తుశిల్పులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 2027 జూన్–జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందే గోదావరి ఘాట్ల నిర్మాణ, అభివృద్ధి పనులు పూర్తిచేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఐటీడీఏ ఈఈ మధుకర్, దేవస్థానం డీఈ రవీందర్ రావు, వాస్తుశిల్పుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
