- District News
- చరిత్రకు మతం రంగు పులిమితే ఊరుకోం
చరిత్రకు మతం రంగు పులిమితే ఊరుకోం
సెప్టెంబర్ 17పై వక్రీకరణలు వీడాలి ......భారత రాజ్యాంగ రక్షణ వేదిక కన్వీనర్, టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం స్పష్టీకరణ
లోకల్ గైడ్ : భద్రాద్రికొత్తగూడెం
సెప్టెంబర్ 17 చారిత్రక సందర్భాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు తెలంగాణ వీరగాథకు మతం రంగు పులుముతూ వక్రీకరణలకు పాల్పడుతున్నాయని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర కార్యదర్శి, భారత రాజ్యాంగ రక్షణ వేదిక కన్వీనర్ మల్లెల రామనాథం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూస్వామ్య పీడనపై సాగిన అసలైన ప్రజా విప్లవమని, దీన్ని హిందూ-ముస్లింల మధ్య వైషమ్యంగా చిత్రీకరించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
*పోరాట సత్యాలు — ముఖ్యాంశాలు*
4 వేల మంది అమరుల త్యాగం, 10 లక్షల ఎకరాల భూపంపిణీ, 3 వేల గ్రామాల విముక్తితో గ్రామ స్వరాజ్యాలను సాధించిన ఘనత కమ్యూనిస్టుల నేతృత్వంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానిది.
*ఫ్యూడల్ అణచివేతపైనే సమరం*
నిజాం పాలనలో అణచివేత సాగించింది కేవలం మతం ప్రాతిపదికన కాదని, నిజాం అండతో విసునూర్ రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాపరెడ్డి వంటి దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు తీవ్రస్థాయిలో దోపిడీ సాగించారని, ఆ దోపిడీకి వ్యతిరేకంగానే పోరాటం జరిగిందన్నారు.
*మతాలకు అతీతమైన అమరత్వం*
రజాకార్ల దురాగతాలకు బందగీ బలవగా, నిజాం ఆగడాలను తీవ్రంగా ఎండగట్టిన షోయబుల్లాఖాన్, మఖ్దూం మొహియుద్దీన్‌ల త్యాగాలు ఈ ఉద్యమం లౌకిక స్వభావానికి నిదర్శనాలని తెలిపారు.
*విమోచన ముసుగులో విద్వేష రాజకీయాలు*
నిజాం లొంగిపోయిన సెప్టెంబర్ 17ను 'విమోచన' పేరుతో విభజన రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు చూస్తున్నాయని మల్లెల విమర్శించారు. నిజంగా అది ప్రజలకు విమోచన రోజే అయితే, 1950 వరకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుతో పాలన ఎందుకు సాగిందని, 1956 వరకు ఆయన రాజప్రముఖ్‌గా కొనసాగుతూ రాజభరణాలు ఎందుకు పొందారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ ప్రజలు గెలిచి ఎర్రజెండా ఎగురవేస్తే ఢిల్లీ పీఠానికే ముప్పు వస్తుందన్న భయంతోనే నెహ్రూ సైన్యాలు రంగప్రవేశం చేశాయని, 1948లో నిజాం లొంగిపోయిన తర్వాత కూడా 1951 వరకు భారత సైన్యాలు తెలంగాణలో ఉండి ప్రజలపై, కమ్యూనిస్టులపై తీవ్ర నిర్బంధాన్ని కొనసాగించాయని గుర్తుచేశారు.
*రాజ్యాంగ పరిరక్షణే నేటి కర్తవ్యం*
నేడు మతం పేరుతో దేశంలో విభజన శక్తులు పెచ్చురిల్లుతున్నాయని, వ్యక్తిగత మతాన్ని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకుంటూ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విచ్ఛిన్నకర శక్తులను ఎదుర్కొని భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి దీపస్తంభంలా నిలుస్తుందని రామనాథం స్పష్టం చేశారు.
