- District News
- Khammam
- నవీన్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలి : అడ్డగోడ ఐలయ్య
నవీన్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలి : అడ్డగోడ ఐలయ్య
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ ఆఫీసర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి, తక్షణమే అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు అందించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడ్డగోడ ఐలయ్య డిమాండ్ చేశారు. సోమవారం నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, నవీన్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్న వయసులోనే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నవీన్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉందని ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబాన్ని రాష్ట్ర, జిల్లా స్థాయి అటవీ శాఖ అధికారులు పరామర్శించడం అభినందనీయమేనని, అయితే పరామర్శలకే పరిమితం కాకుండా ప్రభుత్వం ప్రకటించాల్సిన అన్ని ప్రయోజనాలను తక్షణమే అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి అటవీ శాఖ అధికారులు సీసీఎఫ్ రవికుమార్, భీమానాయక్ తదితర అధికారులతో ఐలయ్య మాట్లాడారు. నవీన్ కుటుంబ పరిస్థితిని వారి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్‌ను ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని కోరారు. నవీన్ కుటుంబానికి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి, నవీన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే నవీన్ పిల్లలు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కుటుంబానికి అవసరమైన ఆర్థిక భరోసా కల్పించేలా నవీన్‌కు రావాల్సిన జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలను అందించాలని కోరారు.
అటవీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అడవుల్లో విధులు నిర్వహించే సిబ్బందికి రక్షణ కల్పించడంతో పాటు, వేటగాళ్లు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. నవీన్ మృతి ఒక్క కుటుంబానికే తీరని లోటు కాదని, విధి నిర్వహణలో అటవీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రమాదాలకు నిదర్శనమని ఐలయ్య అన్నారు. అటవీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూడకుండా వారి భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నవీన్ కుటుంబానికి న్యాయం జరిగేలా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం మరియు అటవీ శాఖ ఉన్నతాధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఐలయ్య విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేటగాళ్లు, అక్రమ వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని, చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
“నవీన్ కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వం తక్షణమే అండగా నిలవాలి. భార్యకు ఉద్యోగం, పిల్లలకు భరోసా, కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం అందించి న్యాయం చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ శాఖ సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించాలి” అని అడ్డగోడ ఐలయ్య స్పష్టం చేశారు. నవీన్ కుటుంబానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలను వెంటనే అందించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను మరోసారి గట్టిగా డిమాండ్ చేశారు.
