- District News
- Khammam
- కారేపల్లిలో బోనాల జాతరలో భక్తి సందడి.. మధ్యలో కులవివక్ష గుసగుసలు...?
కారేపల్లిలో బోనాల జాతరలో భక్తి సందడి.. మధ్యలో కులవివక్ష గుసగుసలు...?
ఒకే ముత్యాలమ్మ.. పది మీటర్ల దూరంలో రెండు గుళ్లు — ‘అక్కడికి వెళ్లొద్దు’ అంటూ భక్తులు ఒక్కరికొక్కరు గుసగుసలు
కారేపల్లి (సింగరేణి ) : సెప్టెంబర్ 2, (లోకల్ గైడ్ న్యూస్ ) : కారేపల్లి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ముత్యాలమ్మ అమ్మవారి బోనాల జాతర భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. డీజే సప్పులు, డప్పు వాయిద్యాలు, టపాసుల మోతలు, రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల మధ్య భారీ సంఖ్యలో మహిళలు బోనాలు ఎత్తుకొని జాతరలో పాల్గొన్నారు. కులాలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కారేపల్లి మండల కేంద్రం సందడిగా మారింది. జాతర వాతావరణం హైదరాబాద్ అంబర్‌పేట బోనాల జాతరను తలపించింది. జాతర కోసం సర్పంచ్, పాలకమండలి, ముత్యాలమ్మ అమ్మవారి కమిటీ సభ్యులు చేసిన ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేసిన ఏర్పాట్లు బాగున్నాయని పలువురు అభినందించారు. అయితే, జాతరను ప్రత్యక్షంగా పరిశీలించిన సమయంలో కనిపించిన కొన్ని దృశ్యాలు మాత్రం భక్తి ఉత్సాహానికి భిన్నంగా ఆందోళన కలిగించాయి. ఆలయ పరిసరాల్లో సుమారు పది మీటర్ల దూరంలోనే రెండు ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాలు కనిపించాయి. జాతర సమయంలో ఒక ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండగా, మరో ఆలయం వైపు కూడా కొందరు భక్తులు వెళ్లేందుకు ప్రయత్నించడం కనిపించింది. ఈ క్రమంలో బోనం ఎత్తుకున్న ఓ బాలిక పక్కనే ఉన్న మరో ఆలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడ ఉన్న ఓ పెద్దావిడ “అది దళితుల ముత్యాలమ్మ గుడి.. మనం అక్కడికి వెళ్లకూడదు” అంటూ ఆమెను నివారించిన దృశ్యం ప్రత్యక్షంగా కనిపించింది. అదే సమయంలో, బోనం ఎత్తుకొని వచ్చిన ఓ దళిత మహిళ పక్క ఆలయంలోకి భక్తులు వెళ్తుండటాన్ని గమనించి అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఆమె అత్తగారు “అది పెద్దకులం వారి గుడి.. మనం అక్కడికి వెళ్లొద్దు” అంటూ అడ్డుకున్నట్లు ప్రత్యక్షంగా గమనించబడింది. ఈ రెండు ఘటనలు అక్కడి భక్తుల మధ్య చర్చకు దారితీశాయి. ఒకే అమ్మవారిని కొలిచే ఆలయాలు కేవలం కొద్ది దూరంలోనే ఉండి, భక్తుల మధ్య మాత్రం కులాల ఆధారంగా వేర్పాటు భావన కనిపించడం పలువురిని ఆలోచనలో పడేసింది.
బోనాల జాతరలో భక్తి, ఆనందం, ఐక్యత వెల్లివిరియాల్సిన సమయంలో కులాల పేరుతో ఆలయాల మధ్య, భక్తుల మధ్య కనిపించిన ఈ విభజనపై స్థానికంగా చర్చ మొదలైంది. అయితే, ఇది ఆలయాల నిర్వహణ కమిటీల అధికారిక నిర్ణయమా, లేక భక్తుల్లో వ్యక్తిగతంగా కొనసాగుతున్న సామాజిక ఆచారమా అన్నది సంబంధిత ఆలయ కమిటీలు, గ్రామ పెద్దలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. జాతర ఏర్పాట్లు, భక్తుల సందడి ఆనందాన్ని కలిగించినప్పటికీ, ప్రత్యక్షంగా కనిపించిన ఈ దృశ్యాలు మాత్రం బాధ కలిగించాయని పలువురు పేర్కొన్నారు. అమ్మవారి సన్నిధిలో కులాలకు అతీతంగా భక్తులందరికీ సమాన గౌరవం, సమానత్వం ఉండాలనే ఆకాంక్ష స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
