- District News
- అంబ సత్రం భూములపై సమగ్ర విచారణ చేపట్టాలి
అంబ సత్రం భూములపై సమగ్ర విచారణ చేపట్టాలి
జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందర్రావు డిమాండ్
లక్ష్మీదేవిపల్లి : లోకల్ గైడ్ న్యూస్ :
మండల పరిధిలోని అనిశెట్టిపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి సంబంధించిన అంబ సత్రం భూములను తిరిగి దళితులకు అప్పగించాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందర్రావు డిమాండ్ చేశారు.
గురువారం ఆయన మాట్లాడుతూ అనిశెట్టిపల్లి గ్రామంలోని అంబ సత్రం భూములను స్థానిక దళితులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. అయితే కాలక్రమంలో కొందరు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు నయానో, భయానో దళితులను బెదిరించి వారి వద్ద నుంచి భూములను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. అనంతరం కొందరు అధికారులతో కుమ్మక్కై రికార్డులను సైతం తారుమారు చేశారని ఆయన ఆరోపించారు.
అంబ సత్రం భూములకు సంబంధించి క్రయవిక్రయాలు జరిగే అవకాశం లేదనే విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అంబ సత్రం అధికారులు క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి, సమగ్ర విచారణ చేపట్టి సర్వే నిర్వహించాలని కోరారు. అర్హులైన దళితుల పేర్లను రికార్డుల్లో నమోదు చేసి వారికి భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు.
అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులతో పాటు భూములను స్వాధీనం చేసుకున్న వ్యక్తులపై రాష్ట్ర, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని వాసుమల్ల సుందర్రావు హెచ్చరించారు. దళితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
