- District News
- Khammam
- బీఆర్‌ఎస్ బురద రాజకీయాలకు కాంగ్రెస్ అభివృద్ధి లెక్కల దెబ్బ!
బీఆర్‌ఎస్ బురద రాజకీయాలకు కాంగ్రెస్ అభివృద్ధి లెక్కల దెబ్బ!
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం.. దమ్ముంటే బీఆర్‌ఎస్ నేతలు ముందుకు రావాలి
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 5, లోకల్ గైడ్ న్యూస్ : బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు కారేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నేతలు ధీటుగా స్పందించారు. అభివృద్ధి పనులపై వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు అన్నారు. వంటావార్పు కార్యక్రమం పేరుతో బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవేనని ఆయన విమర్శించారు. శనివారం కారేపల్లి వైఎస్సార్ గార్డెన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తోటకూరి రాంబాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కారేపల్లి మండలంలో అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టిందన్నారు. ప్రజలకు కనిపిస్తున్న అభివృద్ధిని బీఆర్‌ఎస్ నాయకులు చూడనట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. మండలంలో పంచాయతీరాజ్ నిధులతో 230 సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం తదితర పనులకు సుమారు రూ.24.50 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. అదేవిధంగా 2,400 రేషన్ కార్డులు, గాంధీనగర్‌లో పీహెచ్‌సీ భవన నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు, మాదారంలో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. గుట్టకింద గుంపులో రూ.9 కోట్ల నిధులతో గోదాం నిర్మాణం, మండలంలో 500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది మండల రైతుల నుంచి సుమారు 50 వేల క్వింటాళ్ల మొక్కజొన్నను రూ.2,400 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. కారేపల్లి మండలంలోనే వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, వాటిపై బీఆర్‌ఎస్ నాయకులు ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, పనులపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. "కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై మేము చర్చకు సిద్ధం.. బీఆర్‌ఎస్ నాయకులు సిద్ధమా?" అని తోటకూరి రాంబాబు సవాల్ విసిరారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకు దిగడం ప్రజాస్వామ్య పద్ధతి కాదన్నారు. వంటావార్పు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఎమ్మెల్సీ తాతా మధు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు జిల్లా మంత్రులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తోటకూరి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి నాయక్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు అడ్డగోడ ఐలయ్య, సింగరేణి సర్పంచ్ మేదరి టోనీ ప్రతాప్, భాగ్యనగర్ సర్పంచ్ బానోత్ హీరాలాల్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్, సురపు రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బోళ్ల రమేష్, ఎండి అనీఫ్, ఆదర్ల రాములు, మోతీ వీరస్వామి, వాంకుడోత్ గాంధీ, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
