ముసాయిదా ఓటరు జాబితా విడుదల ... క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు సెప్టెంబర్‌ 16 వరకు అవకాశం... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఖమ్మం జిల్లాలో 10,85,927 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల 1,76,135 మంది ఓటర్లకు ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారుల ద్వారా నోటీసులు

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం
Published On
ముసాయిదా ఓటరు జాబితా విడుదల ... క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు సెప్టెంబర్‌ 16 వరకు అవకాశం... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

IMG-20260817-WA0144ఖమ్మం, ఆగస్టు-17: లోకల్ గైడ్:

సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశామని, క్లెయిమ్‌లు, అభ్యంతరాలు ఏమైనా ఉంటే సెప్టెంబర్‌ 16 లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు.

జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, ముసాయిదా ఓటర్ల జాబితాపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా ఓటర్ల జాబితా, గుర్తించిన అనామలీస్‌, మ్యాపింగ్‌ లేని ఓటర్ల వివరాలు, క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కార ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 17న ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో మొత్తం  10,85,927 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైందన్నారు. ఇందులో 5,24,894 మంది పురుష, 5,60,973 మంది మహిళా, 60 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 1,33,004 మంది అంటే 12.24 శాతం ఓటర్లను అనామలీస్‌ గుర్తించగా, 43,131 మంది అంటే 3.97 శాతం ఓటర్లకు మ్యాపింగ్‌ కానట్లు గుర్తించినట్లు మొత్తం 1,76,135 మంది ఓటర్లకు ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారుల ద్వారా నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

నోటీసులు అందుకున్న వారు సంబంధిత పత్రాలు సమర్పించాలి.
నోటీసులు అందుకున్న ఓటర్లు తమ పుట్టిన తేదీ ఆధారంగా భారత ఎన్నికల సంఘం సూచించిన పత్రాల్లో సంబంధిత పత్రాలను సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.

ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు పరిశీలించుకోవాలి.

ఆగస్టు 17న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేనట్లయితే బూత్‌ స్థాయి అధికారి, సహాయ ఎన్నికల నమోదు అధికారి లేదా ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ceotelangana.nic.in వెబ్‌సైట్‌ ద్వారా తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముసాయిదా జాబితాలో పేరు లేనట్లయితే లేదా వివరాల్లో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే *సెప్టెంబర్‌ 16, 2026లోగా* అభ్యంతరాన్ని సమర్పించవచ్చని తెలిపారు. అదేవిధంగా అర్హత కలిగిన కొత్త ఓటర్లు ఫారమ్‌-6 ద్వారా సెప్టెంబర్‌ 16లోగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అన్నారు.

అర్హులైన కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చు
ప్రస్తుతం కూడా అర్హులైన వారు కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. 2026 అక్టోబరు 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు, ఏ శాసనసభ నియోజక వర్గంలోనూ ఓటరుగా నమోదు కాకపోతే ఫారమ్‌-6 ద్వారా తాజా ఫొటో, వయస్సు ధృవీకరణ పత్రం, డిక్లరేషన్‌ తదితరాలను జతచేసి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

చనిపోయిన లేదా డూప్లికేట్ ఓటర్లపై అభ్యంతరాలు తెలియజేయడానికి  ఫారమ్‌-7, మొబైల్‌ నంబర్‌ నవీకరణ, చిరునామా మార్పు, ఓటరు గుర్తింపు కార్డులో వివరాల సవరణలకు  ఫారమ్‌-8 వినియోగించుకోవచ్చని వివరించారు.

క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు సెప్టెంబర్‌ 16 వరకు అవకాశo
ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్ల జాబితాపై ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు సమర్పించవచ్చని తెలిపారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై నోటీసుల జారీ, పరిష్కార ప్రక్రియ ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 15 వరకు కొనసాగుతుందని చెప్పారు.

అక్టోబర్‌ 19న తుది ఓటర్ల జాబితా
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌ 19, 2026న   ప్రచురించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ పరిధిలోని ఓటర్లకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకునేలా సహకరించాలని సూచించారు.

ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన వివరాల కోసం బూత్‌ స్థాయి అధికారి, సహాయ ఎన్నికల నమోదు అధికారి, ఎన్నికల నమోదు అధికారులను సంప్రదించవచ్చని, అలాగే టోల్‌ఫ్రీ 1950కు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు.

ఈ సమావేశంలో మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎస్డిసి సదానందం, ఆర్డీఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రాజు, డిటి అన్సారీ, బీ.ఆర్‌.ఎస్. పార్టీ ప్రతినిధులు బి.వేణు గోపాల్, సతీష్ బాబు, ఎం.రమేష్, టీడీపీ ప్రతినిధి కృష్ణప్రసాద్, బీజేపీ ప్రతినిధి వి.రాజేష్, సిపిఎం డి.తిరుపతి రావు, కె.ప్రకాశం, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి స్వర్ణ సుబ్బారావు, సిహెచ్ నవీన్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఏ.గోపాల రావు, జి.సూర్య నారాయణ, బిఎస్పీ వేల్పుల రామయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్స్ దారుణ హత్య. 
మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ 
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
ప్రజలతో మమేకమైన పోలీసింగ్