- District News
- శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్ డిమాండ్
...
లోకల్ గైడ్ : అశ్వారావుపేట
హైదరాబాద్ తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలానికి చెందిన ఆదివాసీ యువతి శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై అశ్వారావుపేట ఆదివాసీ నాయకులు, మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా, సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు, ఉన్నత భవిష్యత్తు కోసం స్వగ్రామాన్ని విడిచి నగరానికి వెళ్లిన ఆదివాసీ బిడ్డ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. శిరీష మృతికి దారితీసిన కారణాలను లోతుగా విచారించాలని, ఘటనకు ముందు, ఆ సమయంలో, ఆ తర్వాత చోటుచేసుకున్న ప్రతి అంశాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఘటనపై పారదర్శక దర్యాప్తు జరిపి అసలు నిజాలను బహిర్గతం చేయాలని, విచారణలో దోషులు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని, ప్రైవేట్ ఆసుపత్రులు, ఇతర సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల రక్షణకు పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, తీవ్ర విషాదంలో మునిగిపోయిన శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆదివాసీ సమాజం తరఫున పోరాటం కొనసాగిస్తామని, వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని నారం రాజశేఖర్ స్పష్టం చేశారు.
