- District News
- ఆగష్టు నెలలో గోదావరి 2వ వంతెనపై రాకపోకలు పునరుద్ధరిస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఆగష్టు నెలలో గోదావరి 2వ వంతెనపై రాకపోకలు పునరుద్ధరిస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
వరద కోత నివారణకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నాం
భద్రాచలం : లోకల్ గైడ్ :
భద్రాచలంలోని గోదావరి నదిపై నిర్మించిన రెండో వంతెనకు వరదల కారణంగా దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డును ఈ నెలాఖరులోగా పూర్తిగా పునరుద్ధరించి, వంతెనపై రాకపోకలను ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం గోదావరి వరదల వల్ల కోతకు గురైన రెండో వంతెన అప్రోచ్ ప్రాంతంలో జరుగుతున్న మరమ్మతు పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి దేశ, విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారి సౌకర్యార్థమే రెండో వంతెన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా గోదావరి పుష్కరాలు, శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవాల వంటి సందర్భాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈ వంతెనను నిర్మించామని చెప్పారు. 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఒకే వంతెన ఉండటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయని, అనంతరం అమరావతి–జగదల్పూర్ జాతీయ రహదారి ప్రణాళికలో భాగంగా భద్రాచలం మీదుగా రెండో వంతెన నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రెండో వంతెన పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వరదలు వచ్చినా అప్రోచ్ రోడ్డుకు కోత ఏర్పడకుండా పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నామని, ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి వంతెనపై రాకపోకలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2వ వంతెన అందుబాటులోకి రావడంతో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు భద్రాచలం మీదుగా ప్రయాణించే వాహనదారులు, భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
